ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖలోని గాజువాకలో ఆయన పర్యటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు. తెదేపా హయాంలో అదాని డేటా సెంటర్ తీసుకువచ్చామని లోకేశ్ అన్నారు. వైకాపా హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లు. దొడ్డిదారిన ప్లాంట్ భూములు కొట్టేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు అండగా నిలబడతానని చెప్పేందుకు జగన్‌కు ధైర్యం లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పల్లా ఆధ్వర్యంలో విశాఖలో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచే వరకు ఉద్యమం చేస్తాం.
- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి