తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పదిరోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. రోజూ 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్దేశించింది. జనసంచారం, క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయని తెలిపింది. ప్రజల సౌకర్యార్థం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు సడలింపు ఉంటుంది. అత్యవసర సేవలు, ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో యథావిధిగా పనిచేస్తాయి. ఉపాధిహామీ పనులూ కొనసాగుతాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. అదేసమయంలో రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. వంట గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాలని సీఎస్‌ను, డీజీపీని మంత్రిమండలి ఆదేశించింది. యుద్ధ ప్రాతిపదికన టీకాలను సేకరించాలని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని తీర్మానించింది. ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, ఏ ఒక్కదానికీ కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని సూచించింది.
20న లాక్‌డౌన్‌పై సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రోజూ ఆయా జిల్లాల మంత్రులు కరోనాపై సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 20న మరోసారి కేబినెట్ సమావేశమై లాక్‌డౌన్ కొనసాగింపు విషయమై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏ రోజుకారోజు ఔషధాలు, టీకాలను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
టాస్క్‌ఫోర్స్
కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్, టీకాల విషయమై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖల ముఖ్యకార్యదర్శులు వికాస్‌రాజ్, సందీప్ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి, కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. క్రమం తప్పకుండా ఈ టాస్క్‌ఫోర్స్ సమావేశం జరుగుతుంది.
మరిన్ని ఇంజక్షన్లు ఇవ్వాలన్న సీఎం
మంత్రిమండలి సమావేశం నుంచే సీఎం కేసీఆర్ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత అవసరాలకు తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. త్వరలో కేటీఆర్‌తోవారు సమావేశం కావాలని సూచించారు.
మార్గదర్శకాలు జారీ చేసిన సీఎస్
లాక్‌డౌన్ నిబంధనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అంతర రాష్ట్ర బస్సు సర్వీసులను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల సరకుల రవాణాకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్యాసింజర్ వాహనాల నియంత్రణ కోసం చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఆదేశించారు. మతపరమైన ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు మూసివేయాలని, పూజలు, ప్రార్థనలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి ఉండదని తెలిపారు. కార్మికులు అందుబాటులో ఉండే అన్ని రకాల నిర్మాణాలు, ప్రాజెక్టుల కొనసాగింపునకు అనుమతిస్తున్నట్లు వివరించారు. అక్కడ కార్మికులకు శిబిరాలుండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, నగర పాలికలు, పురపాలికలు, పంచాయతీరాజ్, అగ్నిమాపక, విద్యుత్, నీటి సరఫరా, వాణిజ్య, ఆబ్కారి, రవాణా, వ్యవసాయం, ఉద్యానవనాలు, పౌరసరఫరాలు, కరోనా సంబంధిత విధులు నిర్వర్తించే ఇతర శాఖలు విధిగా పూర్తిస్థాయిలో పనిచేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇతర శాఖలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్దకే రేషన్ అందజేయాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు. హైదరాబాద్, వరంగల్ ఐజీలు నిత్యావసర వస్తువుల రవాణా, లభ్యతకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పూర్తి వేతనాలు చెల్లించాలి
లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రికే
హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు