రాష్ట్రంలో 18 రోజుల తర్వాత సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ సడలింపు సమయాలను పొడిగించగా.. రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, క్రయవిక్రయదారులను, ఇద్దరు సాక్షులను మాత్రమే ఈ పాస్‌ల ద్వారా అనుమతించాలని స్పష్టం చేసింది.
Lockdown Effect: రిజిస్ట్రేషన్ల శాఖకు క్రయవిక్రయదారుల స్పందన కరవు
లాక్‌డౌన్ ప్రభావం నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ బయట పడలేకపోతోంది. లాక్‌డౌన్ సడలింపు గడువు పొడిగించడం వల్ల మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయినా... ఆశించిన స్థాయిలో క్రయవిక్రయదారుల నుంచి స్పందన లేదు. కరోనా ప్రభావంతో బయటికి వచ్చేందుకు జనం భయపడుతున్నారు. మూడు రోజులకు గానూ కేవలం 2,727 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.
సాధారణ రోజుల్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవటం... నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగేది. రోజుకు నాలుగైదు వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషనై.. తద్వారా 25 నుంచి 30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ఇక శుభదినాలు అయితే ఏకంగా 50 నుంచి 60 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం, లాక్‌డౌన్ అమలులో ఉండడం వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థలు అరకొరగానే తెరుచుకుంటున్నాయి. జనం బయపడి బయటకు రాకపోవడం వల్ల వ్యవసయేతర భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు పడిపోయాయి. ఈ పరిణామాలతో రిజిస్ట్రేషన్లు ఆశించిన మేర జరగడం లేదు. గత నెల 31న మొదటి రోజు కేవలం 578 డాక్యుమెంట్లు, రెండో రోజున 1148 రిజిస్ట్రేషన్లు, మూడో రోజున 1001 రిజిస్ట్రేషన్లయ్యాయి. మొత్తం కలిసి కేవలం 2,727 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషనై... దాదాపు 40 కోట్లు రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది.
స్లాట్లు బుకింగ్ ద్వారానే సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు రావాలని నిబంధన విధించడం వల్ల... చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా... సగం వాటిలో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ కాలేదని, ఇలాంటివి అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొంటే కానీ... క్రమంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకోదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.