ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి లాక్‌డౌన్ అమలు చేసేందుకు కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనా మందిరాలతో పాటు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపారులకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర, వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థలు అన్నీ యథావిథిగా పనిచేయనున్నాయి. శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు తహసీల్దార్, ఆర్డీవోల అనుమతి తప్పనిసరి చేశారు. ఆయా కార్యక్రమాలకు పది మందిని మాత్రమే అనుమతిస్తారు. మాస్కు లేకుండా బయటకు వస్తే అపరాధ రుసుము విధించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పెదపూడి మండలంలోని జి.మామిడాడ సూపర్ స్ప్రైడర్ ద్వారా ఏడు మండలాల్లో 272 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు ద్వారా అత్యధికంగా జి. మామిడాడలో 119 కేసులు నమోదు కాగా... రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో మంగళవారం నాటికి 106 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేటి నుంచే పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 11 వరకే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందనేది అధికారులు స్పష్టం చేయలేదు.