కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తనిఖీ చేశారు. స్థానికంగా లాక్‌డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. వివిధ సేవాసంస్థలు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్స్, కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా కేసుల నమోదును పరిగణనలోకి తీసుకుని.. కృష్ణాజిల్లాలో ఐదు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించామని తెలిపారు. ప్రజలు నిర్దేశించిన సమయంలో మాత్రమే బయటకు వస్తూ... తమ పనులు పూర్తైన తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారని చెప్పారు. మైలవరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ.. పోలీసులకు, పాత్రికేయులకు నిత్యావసరాలు అందించారు.
కడపజిల్లా రైల్వేకోడూరు సమీపంలో ప్రభుత్వ విప్ శ్రీనివాసులు పర్యటించారు. శాంతినగర్, రంగనాయకులపేట వీధుల్లో వైకాపా నేతలతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడారు. రైల్వేకోడూరు పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీధివీధి తిరిగి బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేశారు. కడప నగరంలోని అలంఖాన్‌పల్లెలో పశువులకు వింతవ్యాధి ప్రబలింది. స్థానిక గోశాలలో ఉన్న ఆవులకు చర్మ సంబంధమైన వ్యాధి సోకడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. పశువుల శరీరంపై నల్లగా మచ్చలు రావడం... వాటి ద్వారా రక్తం బయటికి వస్తోందని తెలిపారు. పశువులను పరీక్షించిన వైద్యులు.. వీటికి "లంపీ" చర్మవ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.