ఉదయం నుంచి సాయంత్రం వరకు..
గతంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు నగరానికి వచ్చేవి. బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎన్టీఆర్‌నగర్ మార్కెట్లతోపాటు ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి రైతుబజార్లకు చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పంటను విక్రయించుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుదిరిగేవారు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు సమయం సరిపోక.. విక్రయాలు సాగక.. ఖర్చులకు కూడా రావడం లేదని చెబుతున్నారు.
12 నుంచి 12 వరకు...
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి నిత్యం కూకట్‌పల్లి రైతుబజారుకు వచ్చి క్యారెట్, బీట్‌రూట్, టమాటా, కొత్తిమీర తదితరాలు విక్రయిస్తుంటాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి 23 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం క్యారెట్ పంటను తీసుకుని వచ్చి కూకట్‌పల్లిలో అమ్ముకుంటున్నాడు. పంట విక్రయించడానికి పడుతున్న ఇబ్బందులు వివరించారు.
*నిద్ర లేచి సరకు రవాణా చేసే ఆటోట్రాలీకి ఫోన్ చేయాలి. ఆటో ఇంటికి చేరుకునే సరికి కూరగాయలు నింపిన సంచులు సిద్ధంగా ఉంచుకోవాలి.
*ఇంటికి ఆటోట్రాలీ చేరుకుంటుంది. నాలుగు సంచుల క్యారెట్ బస్తాలు ట్రాలీలో లోడింగ్ చేసుకోవాలి.
*లోడింగ్ చేసిన ఆటో ట్రాలీతో కలిసి పక్కఊళ్లో ఉన్న మరో రైతు వద్దకు చేరుకుని అక్కడ బీట్‌రూట్ బస్తాలు, టమాటా బాక్సులు వేసుకుంటారు.
*లోడింగ్ పూర్తయ్యాక అన్నం బాక్సులు కట్టుకుని, మంచినీళ్ల సీసాలు పెట్టుకుని నగరానికి ప్రయాణమవుతారు.