లాక్‌డౌన్ వల్ల మూడు రోజులుగా వ్యాపారం జరగక, తెచ్చుకున్న సరకును కాపాడుకోలేక చిరువ్యాపారులు అవస్థలుపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక లక్ష మంది నష్టపోయారని అంచనా. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాగ్యనగరంలోని 1.6లక్షల మంది చిరువ్యాపారులు రోడ్డున పడతారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వల్పకాల ఆంక్షల సడలింపు వ్యాపారం చేయాలనే ఆశ కలిగిస్తూనే.. భంగపాటుకు గురి చేస్తోందని గుర్తుచేస్తున్నారు.
ప్రారంభించేలోపే మూసివేసే పరిస్థితి
సర్కారులాక్‌డౌన్ ఆంక్షలను ఉదయం 6గ-10గ మధ్య సడలించింది. ఆ సమయంలో చిరు వ్యాపారులు రోడ్డెక్కుతున్నారు. దగ్గర్లోని మార్కెట్లకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలు, పండ్ల కోసం బోయిన్‌పల్లి, ఎన్టీఆర్‌నగర్, మాదన్నపేట, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కొత్తపేట తదితర రైతుబజార్లు, మార్కెట్లకు వెళ్తారు. అక్కడి నుంచి సరకుతో కాలనీలకు చేరుకునేలోపే రెండు గంటలు పూర్తవుతుంది. మరో రెండు గంటల్లో వ్యాపారం ఆపేసి ఇంటికెళ్లాల్సి వస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మరుసటి రోజుకు సరకులు పాడవుతుండడంతో అమ్ముడుపోవట్లేదు. ఆ కారణంతో జనం దగ్గర్లోని సూపర్‌మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్ మొబైల్ అప్లికేషన్లలో ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్ రెండో రోజుకే గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్, ఇతరత్రా అప్లికేషన్లలో వారం రోజుల వరకు వస్తువులను అందించే స్లాట్లు బుక్కైపోవడం గమనార్హం.
సాయంత్రం వరకు అవకాశమివ్వాలి
వీధులు, కాలనీల్లో తిరుగుతూ తోపుడు బండ్లు, ఆటోల్లో కూరగాయలు, పండ్లను సాయంత్రం వరకు విక్రయించుకునే అవకాశం కల్పించాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. తమతోపాటు నగరానికి తీసుకొచ్చిన పంటను పూర్తిగా, గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేస్తున్నారు.