మహమ్మారి కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షల కారణంగా రవాణా పూర్తిగా స్తంభించిపోయి.. ఎగుమతులు, దిగుమతుల్లో అంతరాయం ఏర్పడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి వస్తున్న రైతులకు వ్యాపారులు మొండిచేయి చూపుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోయే సరికి హైదరాబాద్ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డ, మిరప, చింతపండు విక్రయాలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కొవిడ్ విజృంభణతో ఆయా రాష్ట్రాల లారీల డ్రైవర్లు, క్లీనర్లు, రైతులను చూసి హమాలీలు జంకుతున్నారు.
గిట్టుబాటు ధర లేక..
రైతుల ఆందోళనలతో కమీషన్ ఏజెంట్లు శనివారం సరుకులు వేలం వేశారు. ఉల్లిగడ్డ క్వింటాల్ ధర కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.16 వేలు పలికింది. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో వ్యయప్రయాలకోర్చి సరుకు మార్కెట్‌కు తెచ్చినా.. సరైన గిట్టుబాటు లభించడం లేదని రైతులు వాపోతున్నారు.
ఎగుమతులు లేనందున..
ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేనందున మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల నిల్వలు పేరుకుపోతున్నాయి. అయితే మార్కెట్‌లో ఉన్న నిల్వలను సాధ్యమైనంత మేర వేలం పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఎప్పటికప్పుడు సరుకు బయటకు పంపించడం ద్వారా ప్రాంగణాన్ని ఖాళీ చేసి.. శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు.