Attack on secreteriate employees ఏపీలోని వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా ఆక్రమణలను సిబ్బంది తొలగించేందుకు యత్నించారు. క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇంటి ప్రహరీని కూల్చేందుకు సచివాలయ సిబ్బంది వచ్చారు. దీనిపై న్యాయస్థానంలో స్టే ఉందని చెప్పినా వినకుండా కూల్చేందుకు ప్రయత్నించడంతో ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఎలా కూలుస్తారంటూ సిబ్బందిని నిలదీశారు.
కడప నగరంలో అక్రమ ఇళ్ల నిర్మాణం కూల్చివేత ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుని కడపకు వెళ్లే రహదారిలో బుక్కాయిపల్లి వద్ద ఓ ఇంటి నిర్మాణం అక్రమంగా చేపట్టారని రెవెన్యూ సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించగా ఇంటి యజమానులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై సచివాలయ సిబ్బంది టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవచన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.