దారికి అడ్డంగా ఊరికే ఉండటమే బుద్ధి తక్కువ వ్యవహారం. అలాంటిది వేళ కాని వేళ.. చీకటి పడ్డాక సొల్లు కబుర్లు చెప్పుకుంటూ... మందు తాగి తందనాలు ఆడేందుకు నడి రోడ్డేమన్నా ఆడి తాత జాగీరా? కాదు కదా..! కానీ ఇక్కడ ఇది మా తాత జాగీరే అంటున్నారు ఓ ఏరియా బుడ్డ లీడర్లు.
దారివ్వండి.. ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ ప్రశ్నించిన ఓ యువకుణ్ని చావ బాదారు. ఒక్కడు కాదు. ఇద్దరు కాదు. గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఒంటరి యువకునిపై శూరత్వం ప్రదర్శించారు. పిడిగుద్దులు కురిపించారు. బూటుకాళ్లతో తన్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డుపై తాగి తందనాలు ఆడకండి. బుద్ధిగా ఉండండి అంటే ఇంత అరాచకమా? అని అడుగుతున్నాడా బాధిత బ్యాంకు ఉద్యోగి.
రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి మద్యం సేవిస్తున్న సదరు గల్లీ లీడర్లు.. కాదు కాదు.. సిల్లీ లీడర్లు.. కేవలం దారికి అడ్డంగా ఉండొద్దన్నందుకు ఈ యువకుడిని చావబాదారు. లీడర్లంతా ఓ పెద్ద లీడరన్నకు అనుచరులట. అందుకే పోలీసులు కూడా కేసు గీసు జాన్తా నై.. అంటున్నరట. కాంప్రమైజ్, కాంప్రమైజ్ అని కేసు నాన్చుతున్నరట.