స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాల్లో తెరాస అభ్యర్థులు ఎన్నిక కాగా.. తాజాగా స్థానిక సంస్థల కోటాలో 12 మంది గులాబీ నేతలు శాసన మండలికి ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలను తెరాస ఏకగ్రీవంగానే కైవసం చేసుకుంది. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, కె.దామోదర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్‌లో పోటీ అనివార్యమైనప్పటికీ... తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. కరీంనగర్లో భానుప్రసాదరావు, ఎల్.రమణ, ఖమ్మంలో తాత మధు, మెదక్ నుంచి యాదవరెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్ గెలుపొందారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు స్పష్టమైన బలం ఉన్నప్పటికీ...
స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఖరారు నుంచి ఫలితాల వరకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెరాసకు స్పష్టమైన బలం ఉన్నప్పటికీ... మొదట్నుంచీ అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు చేసింది. ఎన్నిక అనివార్యమైన ఆరు ఉమ్మడి జిల్లాల్లో వ్యూహాలకు పదును పెట్టింది. ఓటు హక్కు ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులను యాత్రల పేరిట క్యాంపులకు తరలించారు. కరీంనగర్ జిల్లాలో తెరాసకు రాజీనామా చేసిన రవీందర్ సింగ్ బరిలో నిలవడంతో అక్కడ తెరాస మరింత శక్తియుక్తులను ప్రదర్శించింది. రవీందర్ సింగ్‌కు భాజపా నేత ఈటల రాజేందర్ మద్దతు ఉందన్న ప్రచారం నేపథ్యంలో... ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది.
వారిద్దరికి వచ్చిన ఓట్లలో తేడా...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా.. అందులో 996 తెరాస ప్రతినిధులే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 1,303 ఓట్లు పోలవ్వగా... తెరాస అభ్యర్థులు భానుప్రసాదరావుకు 585, ఎల్.రమణకు 479 దక్కగా... రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు పడ్డాయి. సంఖ్య పరంగా తెరాస తన బలాన్ని నిలుపుకుంది. అయితే భాను ప్రసాదరావు, ఎల్.రమణకు వచ్చిన ఓట్లలో తేడా ఉంది. ఆదిలాబాద్‌లో తమ ఓట్లు చేజారకుండా నిలుపుకుంది. ఆదిలాబాద్‌లో మొత్తం 937 ఓట్లలో తెరాస స్థానిక ప్రజా ప్రతినిధులు 717 మంది ఉన్నారు. ఎన్నికల్లో 862 ఓట్లు పోలవ్వగా... తెరాస అభ్యర్థి దండే విఠల్‌కు 742 ఓట్లు రాగా... స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 మాత్రమే వచ్చాయి.
వర్గ విబేధాలు ప్రభావం చూపాయా?
ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు గెలిచినప్పటికీ... ఓట్లు తగ్గడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో ఎప్పటిలాగే వర్గ విబేధాలు ప్రభావం చూపాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 768లో సుమారు ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలిపి.. 542 మంది తెరాసలోనే ఉన్నారు. తెరాసకు మద్దతునిచ్చిన సీపీఐకి 26 ఓట్లు ఉన్నాయి. కానీ తెరాస అభ్యర్థి తాత మధుకు 480 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 242 ఓట్లు దక్కాయి. మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో క్యాంపులకు తరలించినప్పటికీ.. క్రాస్ ఓటింగ్ ఎలా జరిగిందా అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ఓ గ్రూపు తెరాసకు ఓట్లేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
క్రాస్ ఓటింగ్ జరిగిందా?
మెదక్ జిల్లాలోనూ కొంత క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,026 ఓటర్లలో తెరాసకు చెందిన వారు దాదాపు 800 మంది ఉన్నారు. కానీ తెరాస అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లు దక్కాయి. నల్గొండలోనూ స్వల్పంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి గెలిచిన వారితో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలిపి తెరాసలో సుమారు 990 మంది ఉన్నారు. తెరాస అభ్యర్థి కోటిరెడ్డికి 917.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి.