AP New ministers List: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రుల (కొనసాగనున్న పాత మంత్రుల పేర్లూ కలిపి) జాబితా నేడు ఖరారు కానుంది. ఈ జాబితాను మధ్యాహ్నం గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం వెల్లడించారు. చివరి నిమిషం వరకూ సీఎం జగన్ మార్పులు చేర్పులు చేస్తారని ఆయన అన్నారు. జాబితాను గవర్నర్‌కు పంపిన తర్వాత.. అందులో ఉన్నవారికి సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఫోన్లు వెళ్తాయి. కొత్త మంత్రులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పనున్నారని సీఎంవో వర్గాల సమాచారం.
కొనసాగుతున్న కసరత్తు..:మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మూడు, నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. నేడు ఉదయం కూడా జాబితాపై కసరత్తు జరగనుంది. జాబితాను గవర్నర్‌కు పంపే వరకూ అందులోని పేర్లు బయటకు రాకుండా గోప్యత పాటించాలని సీఎం స్పష్టం చేశారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
ఎవరికి ఏ శాఖ..:కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయిన వారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీబీ) ఏర్పాటు, వాటి బాధ్యతలను మాజీ మంత్రులకు అప్పగించడం, వారికి ప్రోటోకాల్, అందులో న్యాయపరమైన ఆటంకాలు రాకుండా ఎలా చేయాలనే అంశాలపై విస్తృత చర్చ జరిగిందని సమాచారం. కొత్త మంత్రివర్గం కొలువుదీరాక డీడీబీలను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు.
రేపు తేనేటి విందు..:సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు. అది ముగిశాక.. ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొనడంతో పాటు గ్రూప్ ఫొటో తీయించుకుంటారు.
పాత కొత్తల కలయిక..:సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ‘పాత, కొత్తవారి కలయికలో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. పాత వారిలో 7 నుంచి 10 మంది ఉండొచ్చు, లేదా అయిదుగురే కొనసాగవచ్చు. లేదా 10-12 మంది ఉండొచ్చు.. బీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహిళల ప్రాతినిథ్యం కూడా సముచితంగా ఉంటుంది. ముందుగా కొత్త జిల్లాల ప్రాతిపదికన ప్రతీ జిల్లాకూ మంత్రి అనుకున్నా.. కొన్ని జిల్లాల్లో అవసరం ఉండట్లేదు, మరికొన్ని జిల్లాల్లో కుదరట్లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న వారిలో కొందరికి పదవులు రాకపోవచ్చు. అలాగని ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. 149 మంది ఎమ్మెల్యేలూ (మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిచెందారు) ముఖ్యమంత్రి బృందమే. మంత్రివర్గంలో చోటు దక్కని వారికి పార్టీ బాధ్యతలుంటాయి, అందరూ సమానమే. మంత్రి పదవులు వచ్చినవారు ఏమీ ఎక్కువ కాదు’ అని తెలిపారు.
సునాయాసంగానే తొలి కేబినెట్ కూర్పు... ఇప్పుడంత ఈజీగా లేదా..
ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్‌లో తొలి మంత్రివర్గ కూర్పును సునాయాసంగా చేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదంటున్నాయి వైకాపా వర్గాలు. సామాజిక సమీకరణాల దృష్ట్యా పాత మంత్రుల్లో ఒకరిద్దరిని కొనసాగించాలని ముఖ్యమంత్రి తొలుత నిర్ణయించారు. ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సూత్రప్రాయంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ‘మంత్రులంతా రాజీనామా చేయాలి. వారిలో కొనసాగించేవారితో పాటు, కొత్తవారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా’మని కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ ప్రకారమే అంతా జరిగిపోతుందని అంచనా వేశారు. కానీ, అంత సాఫీగా జరగట్లేదని దాని ప్రభావమే పాత మంత్రుల్లో ఒకరో ఇద్దరో కొనసాగుతారన్న ముఖ్యమంత్రి ప్రకటనలో మార్పు చేయాల్సిన పరిస్థితికి దారి తీసిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తొలుత ఒకరిద్దరని.. తర్వాత నలుగురైదుగురని.. ఇంకోసారి అయిదారుగురని.. మళ్లీ 10 మంది వరకు పాత వాళ్లకు అవకాశం ఉందని ఇలా పలు విధాలుగా అధికార పార్టీ నుంచి లీకులు వెలువడ్డాయి. మరోవైపు కొత్తగా చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో చేస్తున్న లాబీయింగ్ సీఎంపై ఒత్తిడి పెంచిందంటున్నారు.