తెలంగాణ

telangana

ETV Bharat / city

Liquor Sales: రాష్ట్ర ఖజానాకు 'కిక్​' ఇస్తున్న మద్యం విక్రయాలు.. దుకాణాలు పెంచుతారా..? - liquor sales increased

కరోనా సమయంలోనూ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు రూ.11వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రోజుకు సగటున రూ.78 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. మరోవైపు అక్టోబర్​ నెలతో ఇప్పుడున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగుస్తుండటంతో.. ప్రభుత్వం కొత్తగా మరిన్ని దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనుందని సమాచారం.

Liquor Sales: రాష్ట్ర ఖజానాకు 'కిక్​' ఇస్తున్న మద్యం విక్రయాలు.. దుకాణాలు పెంచుతారా..?
Liquor Sales: రాష్ట్ర ఖజానాకు 'కిక్​' ఇస్తున్న మద్యం విక్రయాలు.. దుకాణాలు పెంచుతారా..?

By

Published : Aug 24, 2021, 1:33 PM IST

కరోనా ప్రభావం ఆదాయ వనరులపై తీవ్రంగా పడింది. చిన్నచిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడ్డాయి. వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. కానీ మందుబాబులు మాత్రం కోట్లాది రూపాయిల మద్యాన్ని మంచి నీళ్లలా తాగేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.11వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఏడాదికి దాదాపు రూ.30వేల కోట్ల విలువైన మద్యాన్ని తాగేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అక్టోబర్​ నెలతో ఇప్పుడున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​ చివరి నాటికి కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

లెక్కలు ఇలా

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.27,288 కోట్ల విలువైన 3.35 లక్షల కేసుల లిక్కర్‌, 2.73 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రూ.10,925 కోట్ల విలువైన 1.34 కోట్ల కేసుల లిక్కర్‌, 1.17కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోయాయి. అంటే రోజూ సగటున రూ.78 కోట్ల విలువైన మద్యాన్ని రాష్ట్రంలోని మందుబాబులు తాగేస్తున్నారు.

మద్యం అమ్మకాలు

  • ఏప్రిల్‌- రూ.2,269 కోట్లు
  • మే- రూ.2,129.59 కోట్లు
  • జూన్‌- రూ.2,341.18 కోట్లు
  • జులై- రూ.2,767.73 కోట్లు
  • ఏప్రిల్​ నుంచి ఆగస్టు 19 వరకు- రూ.10,926 కోట్లు

అత్యధికంగా రంగారెడ్డి

జిల్లాల వారీగా మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లాంటి చిన్న జిల్లాల్లోనూ వందలాది కోట్ల రూపాయలను మద్యం కోసం ఖర్చు చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.2,449 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగినట్లు అర్థమవుతోంది.

  • రంగారెడ్డి- రూ.2,449 కోట్లు
  • నల్గొండ- రూ.1219 కోట్లు
  • హైదరాబాాద్‌- రూ.1110.54 కోట్లు
  • వరంగల్‌- రూ.896 కోట్లు
  • మహబూబ్‌నగర్‌- రూ.875 కోట్లు
  • మెదక్‌- రూ.860 కోట్లు
  • ఖమ్మం- రూ.799 కోట్లు
  • కరీంనగర్‌- రూ.755.38 కోట్లు
  • ఆదిలాబాద్‌- రూ.608.52 కోట్లు
  • నిజామాబాద్‌- రూ.550 కోట్లు
  • మేడ్చల్‌- రూ.224 కోట్లు

వ్యాట్‌ రాబడి ఎంతంటే?

రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు సమకూరుతున్నాయి. వ్యాట్‌ ద్వారా భారీగా రాబడులు వస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే... రాబడులు ఏకంగా 65శాతం అధికంగా వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

గడిచిన నాలుగు నెలల్లో రాబడి

  • ఏప్రిల్‌-రూ.1059 కోట్లు
  • మే-రూ.975.56 కోట్లు
  • జూన్‌- రూ.922.75 కోట్లు
  • జులై- రూ.1101.53 కోట్లు
  • మొత్తం- రూ.4,058.89 కోట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details