బోనాల సందర్భంగా హైదరాబాద్ మహానగర పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసి వేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
నగరంలో జరిగే లాల్‌దర్వాజా బోనాలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇందుకోసం పలు శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 8 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.