ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగి రెండు నెలలు దాటిపోయింది. బాధిత గ్రామాల ప్రజల జీవితాల్లో అన్ని రకాలుగా చీకటి నింపేసిన ఆ ఘటన ఇప్పటికీ వారి జీవనశైలిపై ప్రభావం చూపుతూనే ఉంది. ఎంత శుభ్రం చేసినా ఇళ్ల నుంచి వెళ్లని రసాయనం వాసన, జీవనశైలిలో మార్పులు సహా.. కీలకమైన వ్యవసాయ రంగం కూడా ప్రభావితమైది..! ఇతర ప్రాంతాల్లో వర్షం పడుతూ అన్నదాతలు ఏ పంట వేయాలా అని ఆలోచిస్తుంటే.. అన్నీ ఉన్నా ఆశాభంగమే అన్నట్లు తయారైంది ఇక్కడి రైతుల పరిస్థితి.
మొక్కలపైనా స్టైరీన్ ప్రభావం
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ సమీపంలోని వెంకటాపురం, కంచరపాలెం పరిధిలో రెండు నెలలు కిందట పచ్చటి పొలాలు కనిపించేవి. కానీ ఇప్పుడు రైతుల ముఖాల్లో దుఖం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఏటా పంట పుష్కలంగా పండే మేఘాద్రిగడ్డ పరిధిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏపుగా పెరిగిన మొక్కలు సైతం స్టైరీన్ ప్రభావంతో నాసిరకంగా తయారయ్యాయి. కొత్తగా వేసిన మొక్కల్లో ఎదుగుదల ఉండడం లేదు. తొలకరిలో కాస్త సాహసం చేసి సరుగుడు, టేకు, అరటి, మామిడి మొక్కలు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణం.