తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ఉద్యమంలోకి స్థానికంగా నియామకాలు తగ్గిపోగా క్షేత్రస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు వందమంది మావోయిస్టులు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో నిమగ్నం కాగా అందులో 85 మంది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వారే. ఈ మేరకు నిఘా విభాగం నివేదిక రూపొందించింది. ఇప్పుడు వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
అక్కడి వారికి ప్రత్యేక శిక్షణ...
గతంతో పోల్చితే రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు తగ్గిన సంగతి తెలిసిందే. నియామకాలు తగ్గిపోవడం..లొంగిపోవడం, ఎన్‌కౌంటర్లలో మరణించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక్కడ మళ్లీ సత్తా చాటుకునేందుకు మావోయిస్టు అగ్రనాయకత్వం దృష్టి సారించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం తెలంగాణకు చెందిన 145 మంది అజ్ఞాతంలో ఉండగా వీరంతా చత్తీస్‌ఘడ్‌లో ఉన్నట్లు తేలింది.