భారత్ నైపుణ్య నివేదిక-2020 ప్రకారం యువతలో సగం కన్నా తక్కువ మందికే నైపుణ్యం ఉందనే కఠోర వాస్తవాలను బయటపెట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పలు అంశాల్లో ముందంజలో నిలవడం మాత్రమే ఆశాజనకమైన అంశం. ఏఐసీటీఈ, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), వీబాక్స్ సంస్థ ఈ ఏడాది జులై నుంచి నవంబరు వరకు దేశ వ్యాప్తంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఈ నివేదిక రూపొందించాయి. 3,500 విద్యా సంస్థలకు చెందిన 3 లక్షల మంది విద్యార్థులు, తొమ్మిది రంగాలకు చెందిన 150 మంది కార్పొరేట్ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.
సర్వేలో ముఖ్యాంశాలు
- అబ్బాయిలు పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, ఏపీ, కర్ణాటక మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ పదో స్థానంలో నిలిచింది.
- అమ్మాయిలు పనిచేసేందుకు ఇష్టపడే రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, యూపీ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో నిలవగా, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. నగరాల్లో మాత్రం బెంగళూరు, కోయంబత్తూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, దిల్లీ, ముంబయి, లఖ్నవూ ఉన్నాయి.
- వార్షిక వేతనం రూ.2.6 లక్షల కంటే అధికంగా ఉండాలని కోరుకుంటున్న వారి శాతం 55.
- ఈసారి ఇంటర్న్షిప్ కోరుకుంటున్న వారి శాతం 87.65కు పెరిగింది. గతేడు 83.51 శాతమే ఉండేది.
- అబ్బాయిలు పనిచేసేందుకు ఇష్టపడే నగరాల్లో హైదరాబాద్కు 8వ స్థానం.