తెలంగాణ

telangana

ETV Bharat / city

బీర్లకు తగ్గిన డిమాండ్​.. భారీగా పడిపోయిన అమ్మకాలు - మద్యం అమ్మకాలు

లాక్‌డౌన్‌ ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఎండాకాలంలో లిక్కర్‌ కంటే బీరు విక్రయాలు రెట్టింపుగా ఉండాల్సింది పోయి... ఇప్పుడు లిక్కర్‌ కంటే అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సగటున రోజుకు రెండు లక్షల కేసుల బీర్‌ విక్రయాలు జరగాల్సి ఉండగా అందులో సగానికి పడిపోయాయి.

less demand to beer in state.
బీర్లకు తగ్గిన డిమాండ్​

By

Published : May 12, 2020, 11:05 AM IST

Updated : May 12, 2020, 4:42 PM IST

రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాల్లో సింహభాగం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లోనే ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ బీర్ అమ్మకాలు కాస్త ఎక్కువే. ఇక ఎండాకాలం వస్తే చాలు ఒక్కసారిగా అమ్మకాలు రెట్టింపు అవుతాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా బీర్‌ విక్రయాలు భారీగా పడిపోయాయి. మద్యం దుకాణాలు ఈ నెల 6న తెరుచుకోగా.. మద్యం ప్రియులు మొదటి రెండు రోజులు ఎగబడ్డారు. ఆ తర్వాత రోజు నుంచి మద్యం అమ్మకాలు మందగించాయి. ఎక్కడ వారు అక్కడ ఉండిపోవడం, ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో బీర్‌ విక్రయాలు భారీగా పడిపోయాయని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ధరలు కూడా అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణమని దుకాణదారులు పేర్కొంటున్నారు.

సగానికి పైగా పడిపోయిన సెల్స్​..

2019 మే నెలలో 26.53లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడు పోగా... 60.12లక్షల కేసుల బీర్‌ విక్రయాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 85వేల కేసుల లిక్కర్‌, 1.93లక్షల కేసుల బీర్‌ అమ్ముడుపోయేది. అదే ఈ నెలలో గత ఆరు రోజుల్లో 9.39లక్షల కేసుల లిక్కర్‌, కేవలం 6.47లక్షల కేసుల బీర్‌ విక్రయం జరిగింది. దీనిని బట్టి బీర్‌ సెల్స్​ సగానికి సగం పడి పోయాయని స్పష్టమవుతోంది.

మూడో వంతు కూడా..

మరోవైపు గత ఆరు రోజుల్లో రూ.800 కోట్ల మద్యాన్ని డిపోల నుంచి దుకాణదారులు కొనుగోలు చేశారు. కానీ మొదటి రోజు అమ్ముడు పోయిన మద్యంలో మూడో వంతు కూడా ఇప్పుడు విక్రయించలేకపోతున్నామని వాపోతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే చెల్లించిన లైసెన్స్ ఫీజు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యథాతథంగా కార్యకలాపాలు మొదలైతే మద్యం విక్రయాలు గతంలో మాదిరి తిరిగి ఊపందుకుంటాయని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించండి : సీఎం

Last Updated : May 12, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details