AP Assembly Session: సభలో సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకూ సమాధానాలు పంపడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు స్పష్టం చేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం అసెంబ్లీ కమిటీహాలులో వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.
ప్రతి ఒక్కరి దృష్టి ఈ సమావేశాలపైనే: సభాపతి సీతారాం
అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలకు ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించాలని ఏపీ శాసనసభాపతి సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలందరి దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందన్నారు. సభలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వడం ద్వారా సభ్యుల గౌరవాన్ని కాపాడటంలోనే గౌరవం ఉందనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నల్లో పురపాలక, ఆర్థిక, పౌరసరఫరాలు, హోం శాఖల నుంచి రావాల్సిన సమాధానాలే ఎక్కువగా పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో నాలుగువైపులా పటిష్ఠమైన బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, శాసనమండలి ఓఎస్‌డీ కె.సత్యనారాయణరావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.