వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నా.. మోదీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని వామపక్షాల నేతలు ఆక్షేపించారు. గడ్డకట్టే చలిలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 27 రోజులుగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో... చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సాగు చట్టాలు నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక నిరాహర దీక్షకు నేతలు హాజరయ్యారు.
'వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి' - cpm leaders protest at indira park
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక నిరాహర దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హజరయ్యారు. దిల్లీలో సాగుతున్న ఉద్యమానికి వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. 3 వ్యవసాయ చట్టాలు తిరస్కరిస్తూ కేరళ తరహాలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీలో సాగుతున్న ఉద్యమానికి వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ కేరళ తరహాలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి, ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్న రైతులు తమ పంటను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, నంద్యాల నరసింహారెడ్డి, ఆచార్య లక్ష్మీనారాయణ, రైతు సంఘాల నేతలు తీగల సాగర్, పశ్య పద్మ, కెచ్చల రంగారెడ్డి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.