Death in Atmakur govt hospital: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీగార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం...ఆ తర్వాత ఆ వ్యక్తి మృతి చెందడం వివాదాస్పదమైంది. ఆత్మకూరు ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం సరిగా అందకపోవడం వల్లే చనిపోయాడంటూ బంధువులు ఆరోపించారు. ఆత్మకూరు ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..మంగళవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఓ అధ్యాపకుడికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ వేసి పట్టించుకోలేదు. బాధితుడికి రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలవగా సెక్యురిటీ గార్డులు, స్వీపర్లే బ్యాండేజీ కట్టారు. అక్కడినుంచి నెల్లూరు జీజీహెచ్‌కు తరలిచేందుకు స్ట్రెచర్‌లో తీసుకెళ్తుండగా ఆ బ్యాండేజీ సైతం ఊడింది. ఆత్మకూరు ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్ ధ్వజం.. ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని నారా లోకేశ్ ట్విటర్లో ధ్వజమెత్తారు. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా అని మండిపడ్డారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రజారోగ్య దేవుడు అని ప్రచారం చేసుకుంటుంటే.. వాస్తవానికి ఆయన ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు. కక్ష సాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని విమర్శించారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. రోజురోజుకీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:వైద్యసిబ్బందిపై మంత్రి హరీశ్‌రావు ఫైర్.. తీరుమార్చుకోవాలని వార్నింగ్..
వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!