Unauthorized Layouts Registration in Telangana: రాష్ట్రంలో అనధికార రిజిస్ట్రేషన్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం కానుంది. అయితే నిబంధనలు పాటించిన వాటికే ఈ విధానం వర్తించనుంది. దాదాపు రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన అనధికార లేఅవుట్‌లలోని ప్లాట్లలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఉన్నవాటికి లేఅవుట్ క్రమబద్దీకరణ చార్జీలను తీసుకుని రిజిస్ట్రేషన్‌లకు అనుమతించేలా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వలు వెలువడనున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ నిలిపివేత:రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రెండు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేశాయి. నిబంధనల మేరకు ఉన్న అనధికార లేఅవుట్‌లలో రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఉంటూ ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను చెల్లించిన లేఅవుట్‌లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లకు అనుమతించాలని నిబంధనలు సిద్దమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార లేఅవుట్‌లలో రిజిస్ట్రేషన్‌లను 2020 సెప్టెంబర్‌లో నిలిపివేసింది. అదే సంవత్సరం అక్టోబరు 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల యజమానులతో పాటు వేల సంఖ్యలో అనధికార లేఅవుట్‌లున్నాయి. వీటిని పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌లను అనుమతించే ప్రక్రియ నేపథ్యంలో న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ నిలిచిపోయింది.