రాష్ట్రవ్యాప్తంగా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. సంబంధిత ప్లాటు లేదా లేఅవుట్ నిబంధనల మేరకు ఉందా? లేదా? నిర్ధారించుకుంటారు. నిబంధనల మేరకు ఉంటే ఎల్‌ఆర్‌ఎస్ కోసం నిర్దేశించిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు.
రుసుం చెల్లించిన తర్వాత పురపాలక సంఘాల్లో కమిషనర్లు, గ్రామపంచాయతీల్లో కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ క్రమబద్ధీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు పురపాలక సంఘాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 31ని ఆఖరు తేదీగా నిర్దేశించింది.