తెలంగాణ

telangana

ETV Bharat / city

సభలో ఒక్కసారిగా విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్​.. ఎందుకంటే..?

telangana Assembly session: బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా సభలో "మన ఊరు- మన బడి" కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించిన నిధుల గురించి మొదలైన చర్చ కాస్తా.. 2009-14 సమయంలోని సభా పరిస్థితులపైకి మళ్లింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క వివరించిన తీరు సభ్యులకు నవ్వు తెప్పించింది.

Laughter spread all at once in telangana Assembly session
Laughter spread all at once in telangana Assembly session

By

Published : Mar 12, 2022, 4:56 PM IST

Updated : Mar 12, 2022, 6:12 PM IST

సభలో ఒక్కసారిగా విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్​.. ఎందుకంటే..?

telangana Assembly session: బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా సభలో "మన ఊరు- మన బడి" కార్యక్రమంపై సీరియస్​గా చర్చ జరుతుండగా.. ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం పెట్టిన కార్యక్రమం.. మన ఊరు- మన బడికి ప్రభుత్వం కేటాయించిన నిధులపై చర్చ సాగుతున్న సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాటలతో సభలో నవ్వులు వికసించాయి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఎవరూ ఆసక్తి చూపించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందినంత వేగంగా రెసిడెన్షియల్​ పాఠశాలలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కూడా కేవలం పాఠశాల భవనాలు అభివృద్ధి చేస్తే సరిపోదని.. అందుకు తగ్గట్టుగా బోధనాసిబ్బందిని సైతం నియమించాల్సిన అవసరం ఉందని సూచించారు. మన ఊరు- మన బడి కోసం ఏసీడీపీ​ నిధుల నుంచే ఖర్చుపెడుతున్నారని.. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్​.. కాంగ్రెస్​ హయాంలో సుమారు 150 మాత్రమే ఉన్న రెసిడెన్షియల్​ స్కూళ్లు.. ఇప్పుడు ఏకంగా పది రెట్లు పెరిగి 900కు చేరాయని స్పష్టం చేశారు. అందులో చదువుతున్న ఒక్కో విద్యార్థి మీద.. లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. కేవలం విమర్శించేందుకే ప్రతిపక్ష నాయకులు చూడొద్దని.. మంచిని కూడా ఒప్పుకోవాలని హితవు పలికారు. ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెట్టాలో.. విధివిధానాలుంటాయని తెలిపారు. అందులో భాగంగానే పాఠశాలల అభివృద్ధికి ఏసీడీపీ​​ నిధుల్లో కొన్నింటిని కేటాయించినట్టు మంత్రి వివరించారు. ఒకవేళ.. కాంగ్రెస్​ నేతలకు పాఠశాలలను అభివృద్ధి చేయటం ఇష్టంలేకపోతే చెప్పాలన్నారు.

ఈ చర్చ కాస్తా.. మన ఊరు- మన బడికి నిధుల కేటాయింపు నుంచి.. సీడీఎఫ్​ నిధుల దగ్గరికొచ్చి.. అటు నుంచి బడ్జెట్​ సమావేశాలకు సరైన సమయం కేటాయించట్లేదన్న వాదన దగ్గరికొచ్చి.. అక్కడి నుంచి నేరుగా 2009-14 సభకు వెళ్లింది. బడ్జెట్​ ఆమోదానికి, ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయించట్లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సే శ్రీధర్​బాబు ఆరోపించటంతో.. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్​రెడ్డి స్పందించారు. కాంగ్రెస్​ హయాంలో కేవలం గంట పాటే సభ జరిగేదని.. ఇప్పుడు 6 నుంచి 7 గంటల పాటు నాణ్యమైన చర్చ జరుగుతోందని వివరించారు.

దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క.. "2009-14 సమయంలో నేను సభాపతిగా ఉండి సమావేశాలు నడిపించాను. ఆ సమయంలో సమావేశాలు గంట పాటే నడిచేవి. ఎందుకంటే.. సభ ప్రారంభం కోసం గంట కొట్టటమే ఆలస్యం.. ఇప్పుడు మున్సిపల్​ మంత్రిగా ఉన్న కేటీఆర్​, ఆర్ధిక మంత్రిగా ఉన్న హరీశ్​రావు.. టేబుళ్ల మీది నుంచి దూకే కార్యక్రమాలు చేసేవారు. ఆ బల్ల మీది నుంచి దూకితే ఈ బల్ల మీదికి.. ఈ బల్ల మీది నుంచి స్పీకర్ బల్ల​ దగ్గరికి.. అక్కడి నుంచి మైక్​ దగ్గరికి దూకే కార్యక్రమాలు చేపట్టేవాళ్లు. ఇక సభ ఎక్కడ నడుస్తుంది." అని అప్పటి పరిస్థితులను వివరించారు. ఈ మాటలతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆ సమయంలో వాళ్లు చేసిన పనులు గుర్తు తెచ్చుకుని మంత్రి కేటీఆర్.. భట్టి వివరిస్తున్నంత సేపు పడిపడి నవ్వుకున్నారు. మంత్రి​తో పాటు.. మిగతా సభ్యులు కూడా భట్టి మాటలకు కాసేపు నవ్వుకున్నారు. దానికి సమాధానంగా.. "అప్పుడు బల్లలు దూకే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ వచ్చింది" అంటూ ప్రశాంత్​ రెడ్డి చమత్కరించారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 12, 2022, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details