రాష్ట్రంలో రికార్డు స్థాయిలో శనివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా 253 మందికి వైరస్ సోకింది. వీరిలో 179 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే. మరోవైపు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడా రెండంకెల సంఖ్యలో బాధితులున్నారు. కరోనా బాధితుల్లో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి (24), మేడ్చల్ (14), రంగారెడ్డి (11) జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వలసలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి కరోనా కేసులు ఎక్కువగా వచ్చేవి. శనివారం నమోదైన కేసులన్నీ రాష్ట్రంలోనివే. కొవిడ్ చికిత్సతో కోలుకుని 74 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 2,203 మంది చికిత్స పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గన్‌మెన్‌కూ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఛైర్మన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
వారంలో మూడుసార్లు పెరుగుదల
కొవిడ్ పాజిటివ్ కేసులు వారం రోజులుగా పెరుగుతున్నాయి. మూడుసార్లు 200 మార్కును దాటాయి. గత శనివారం జూన్ 6న రికార్డు స్థాయిలో 206 కేసులొచ్చాయి. మళ్లీ జూన్ 11న 208 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 250 మార్కును దాటి... శనివారం 253 కేసులు వచ్చాయి. మే 16న లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తరువాత కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రయాణాల సమయంలో కొందరు రక్షణ చర్యలు పాటించడం లేదని, మాస్కులు, భౌతిక దూరం పాటించకపోవడంతో కేసులు సంఖ్య ఎక్కువవుతోందని తెలిపింది.
చిన్నారి సహా కుటుంబంలో ఐదుగురికి...
మహబూబ్‌నగర్ జిల్లాలోని మండల కేంద్రమైన మూసాపేటలో 13 నెలల బాబుకు కొవిడ్ సోకింది. నాలుగు రోజుల కిందట బాబు నాయనమ్మకు పాజిటివ్ వచ్చింది. తర్వాత తాతకు కూడా వైరస్ సోకినట్లు తేలింది. తాజాగా ఆ ఇంట్లో 13 నెలల బాబు, ఆ చిన్నారి తల్లిదండ్రుల్లోనూ వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో ఈ కుటుంబంలో అయిదుగురు కరోనా పీడితులుగా మారారు.