Laser Speed Guns in Hyderabad : రహదారులపై రయ్యిమంటూ వాయు వేగంతో దూసుకెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు లేజర్ స్పీడ్ గన్లతో కళ్లెం వేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్య ధోరణికి చెక్ పెట్టేందుకు వినియోగిస్తున్నారు. మితిమీరిన స్పీడ్‌తో వెళ్తున్న వాహనచోదకులను గుర్తించి.. ఆయా వాహనాల వేగాన్ని రికార్డు చేసి నిమిషాల్లో ఫొటో, జరిమానాతో కూడిన సంక్షిప్త సందేశాన్ని నిబంధనలు ఉల్లంఘించిన వారి చరవాణులకు పంపుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిల్లో రోజుకు రెండు వేలకుపైగా వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు.
స్పీడ్ పెంచితే.. క్లిక్‌మనిపిస్తుంది..
Laser Speed Guns for Vehicles : స్పీడ్ గన్ కెమెరాలను సాఫ్ట్‌వేర్ సాయంతో అత్యాధునికంగా మార్చారు సాంకేతిక నిపుణులు. జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల వేగపరిమితిని కెమెరాలో నిక్షిప్తమయ్యేలా మార్పులు చేశారు. రవాణా శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడం వల్ల వాహనాల నంబర్లు, వాటి యజమానులు.. వారి చరవాణుల వివరాలన్నీ కెమెరాలో ఉంటాయి. వాహనచోదకులు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటే కన్నుమూసి తెరిచేలోపు వాహనాన్ని వేర్వేరు కోణాల్లో కెమెరా ఫొటో తీస్తుంది. వాహన యజమాని ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సందేశంతో పాటు ఫొటో వెళ్లిపోతుంది. ఇలా ఒక నిమిషానికి సగటున 200 వాహనాల ఫొటోలను తీయడంతో పాటు వాటి వేగాన్ని విశ్లేషిస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
'రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మేం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాం. అందులో ఒకటే.. ఈ లేజర్ స్పీడ్ గన్. ఈ లేజర్ స్పీడ్ గన్.. అతివేగంతో వెళ్లే వాహనాల ఫొటోను క్లిక్‌మనిపిస్తుంది. ఆ ఫొటోకు జరిమానాను జతచేసి మేం సదరు వ్యక్తి మొబైల్ నంబర్‌కు పంపిస్తాం. ఈ రకంగా మేం వాహనదారులు వేగంగా వెళ్లకుండా నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. దీనివల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి.'