Godavari Floods In AP: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ఉద్ధృతికి విలీన మండలాలు మరోసారి వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాలకు వరద పోటెత్తింది. వీఆర్పురం, చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులు నీట మునిగాయి. ఈ సీజన్‌లో మూడోసారి గోదావరి నదికి వరదలు రావడంతో.. పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి, పంట కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రాంతంలోని నదీ పాయల్లో ప్రవాహ ఒరవడి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలడంతో గౌతమి, వశిష్ఠ, వైనతేయ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు మరోసారి ముంపులో చిక్కుకున్నాయి.
అల్పపీడన ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నిండా మునిగాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ముంచుకొచ్చిన గోదావరి వరద కలిసి.. కోనసీమ లంకగ్రామాల ప్రజల కష్టాలను రెట్టింపు చేశాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది. ముమ్మిడివరం మండలం పరిధిలోని 8 లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. రహదారులు నీట మునిగి.. నాటు పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల్లో కాయలు వరదకు కొట్టుకుపోకుండా రైతులు ఒడ్డుకు చేర్చుకుంటున్నారు.