తెలంగాణ

telangana

ETV Bharat / city

Hyd Lands: నోరు.. పేరు.. ఉన్నోడిదే జాగీరు.. సొసైటీల ముసుగులో మాయాజాలం - హైదరాబాద్ స్థలాలు కబ్జా

ఇది హైదరాబాద్​ మహా నగరం.. అడుగు స్థలమూ రూ.లక్షల్లో ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని ఆధారం చేసుకుని పేట్రేగిపోతున్నారు. అమాయకులకు వాటిని అంటగట్టి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అధికారులు, నేతల కనుసన్నల్లో సాగుతోందన్న ఆరోపణలూ లేకపోలేదు.

Hyd Land
Hyd Land

By

Published : Aug 24, 2021, 10:47 AM IST

హైదరాబాద్​లో ఖాళీ స్థలాలు తక్కువ ధరకు విక్రయిస్తాం. కోరుకున్న ఇంటిని నిర్మించి ఇస్తాం. ఈ హామీలు సొంతింటి కలలుగనే వారికి ఇవి ఉత్సాహాన్నిస్తాయి. అప్పుచేసి, అడిగినంత సొమ్ము చెల్లించి చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తులు క్రమబద్ధీకరించుకుంటున్నారు. లేనివారు పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కో-ఆపరేటివ్‌, హౌసింగ్‌ సొసైటీల ముసుగులో కొందరు భారీగా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఇద్దరు ముగ్గురికి విక్రయించి అందినంత దండుకుంటున్నారు.

  • కూకట్‌పల్లిలోని ఓ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు బాచుపల్లి వద్ద సర్వే నంబర్లను చూపుతూ ప్లాట్లను విక్రయించి రూ.20 కోట్ల వరకూ రాబట్టుకున్నారు.
  • బంజారాహిల్స్‌లో కొన్ని హౌసింగ్‌ సొసైటీలు స్థలం లేకుండానే లావాదేవీలు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులందాయి.
  • ఆసిఫ్‌నగర్‌ రెవెన్యూ మండల పరిధిలో ఓ ప్రభుత్వ స్థలాన్ని సొసైటీకి చెందినదిగా విక్రయించేసి, తర్వాత పలుకుబడితో క్రమబద్ధీకరించుకున్నారు.
  • ఓ ప్రముఖ సినీ నిర్మాత సొసైటీ ద్వారా ఓ స్థలాన్ని కొనుగోలు చేసి తరువాత జీవో ద్వారా సొంతం చేసుకున్నారు. విలాసవంతమైన భవనం నిర్మించారు.

నాలుగెకరాలపై నయా నాటకం

సర్కారు స్థలం ఆక్రమణకు గురైతే బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉండగా ఇక్కడ పూర్తిభిన్నంగా జరుగుతోంది. షేక్‌పేట్‌ రెవెన్యూ మండల సర్వే నం.403లో 4 ఎకరాల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలొచ్చాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఎమ్మెల్యే కాలనీ కోసం గతంలోనే 100 ఎకరాలు కేటాయించారు. ఆ పక్కనే హెచ్‌ఎండీఏ, దిల్‌ సంస్థ భూములున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి హౌసింగ్‌ సొసైటీ ముసుగులో 4 ఎకరాల స్థలంలో ప్లాటు వేసి రిజిస్ట్రేషన్లు చేశాడు. మరో హౌసింగ్‌ సొసైటీ విజిలెన్స్‌, రిజిస్ట్రేషన్‌ విభాగాలకు ఫిర్యాదు చేయటంతో అక్రమం వెలుగు చూసింది. ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు సేల్‌ డీడ్‌ చేయించుకున్నట్టు సమాచారం. రంగంలోకి దిగిన రెవెన్యూ విభాగం తమకు అక్కడ స్థలం లేదంటూ నిర్ధారించింది. హెచ్‌ఎండీఏ పరిశీలించి తమ 4 ఎకరాలు సురక్షితంగా ఉందని గుర్తించింది. ఆ హౌసింగ్‌ సొసైటీకి జూబ్లీహిల్స్‌లో కేటాయించిన 4 ఎకరాల స్థలం సర్వే నంబర్లు మార్చి ఏమార్చారనే ఆరోపణలున్నాయి.

  • సంపన్నులుండే చోట నివాసం. ఖరీదైన కారు.. చుట్టూ అనుచరులు. మాటలతో కోటలు కట్టగల నేర్పరితనం. పెద్దమనిషిగా కనిపించే ఆయన నగర చుట్టుపక్కల విలువైన భూములన్నీ తమ పూర్వీకులవేనంటూ అమ్మకానికి పెడతాడు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసేస్తాడు. తహసీల్దార్‌ సంతకాలను ఫోర్జరీ చేయించగల నేర్పరి. పలు పోలీస్‌స్టేషన్లలో ఆయనపై కేసులున్నాయి.
  • ఆ మాజీ ప్రజాప్రతినిధికి బోలెడన్ని ఆస్తిపాస్తులు. తానుండే చోట ఖాళీ స్థలాలను సొమ్ముగా మార్చడంలో దిట్ట. కాగితాలపై సర్వే నంబర్లను చూపుతూ విలువైన స్థలాన్ని చౌకగా కట్టబెడుతుంటారనే పేరుంది. లాక్‌డౌన్‌ వేళ ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌లో 400, 500, 600 చదరపు అడుగుల ప్లాట్లను విక్రయించాడు. రూ.70-80 కోట్లు వెనకేసుకున్నాడు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలున్నాయి.

నకిలీ పత్రాలతో బురిడీ

నగరంలో సరికొత్త ‘భూ’చోళ్లు. ఖాళీ/వివాదాస్పద స్థలాలను సొమ్ము చేసుకోవటంలో వీరికి వీరే సాటి. గ్రేటర్‌లో ఈ ఏడాది సుమారు 30-40 వరకూ భూ వివాదాలపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఆరోపితుల్లో ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌, బండ్లగూడ తదితర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ. ఉప్పల్‌కు చెందిన దంపతులు మూడేళ్లుగా దందా సాగిస్తున్నారు. నకిలీపత్రాలతో బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. మూడుసార్లు జైలుకెళ్లొచ్చినా ఆపలేదు. ఈ 8 నెలల వ్యవధిలోనే రూ.120 కోట్ల రుణాలు పొందారని సమాచారం.

భూచక్రం ఎటైనా తిప్పగలరు

సొమ్ములు కురిపించే స్థలాల విషయంలో అక్రమార్కుల శైలి భిన్నం. హోదా, పలుకుబడి ఉన్నట్టు సృష్టించుకుంటారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు న్యాయనిపుణులను నియమించుకుంటారు. బంజారాహిల్స్‌లో 5 ఎకరాల స్థలాన్ని దక్కించుకొనేందుకు ఓ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించింది. హక్కుదారుల భయాన్ని అవకాశంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది. ఓ కీలక నేత మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి స్థలాలను తక్కువ ధరకు దక్కించుకుంటాడు. వివాదాస్పద భూములైతే మరింత ఆజ్యం పోస్తాడు. ఇరువర్గాలను రెచ్చగొట్టి సన్నిహితులతో కలిసి ఆ స్థలాలను లాగేసుకుంటాడు. వీరి అక్రమాలపై స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పలుమార్లు నివేదికలు ప్రభుత్వానికి అందజేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

జాగా దక్కెదెవరికో?

ఎంతో విలువైన ఆ ప్రభుత్వ భూమిని పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం లీజుకిచ్చింది. గడువు ముగిసేలోగా ఆస్థలం ఐదారుగురి చేతులు మారింది. వందల సంఖ్యలో పరిశ్రమలు వెలిశాయి. బాలానగర్‌లోని సహకార పారిశ్రామికవాడలో 47 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. పరిశ్రమల స్థాపనకు 1961లో కేటాయిస్తూ జీవో ఇచ్చారు. స్థాపకులు 52 ఏళ్ల తరవాత తిరిగివ్వాలని పేర్కొంది. ఇక్కడ ఎకరం, అర ఎకరం పొందిన కొందరు పదేళ్లలోపే అమ్ముకుని, షెడ్లు వేసి సబ్‌ లీజులకిచ్చి రూ.కోట్లు గడించారు. ప్రస్తుతం 226 పరిశ్రమలున్నాయి. దీన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో అప్పట్లో కలెక్టర్‌ స్పందించి సర్వే చేయించారు. ఒక స్థలం గరిష్ఠంగా ఐదుగురి చేతులు మారినట్లు అప్పటి రంగారెడ్డి జిల్లా జేసీ విజయానంద్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

మంత్రి సమావేశంతో అలజడి

మంత్రి కేటీఆర్‌ బాలానగర్‌లో రెండుసార్లు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశమయ్యారు. 2015 తర్వాత నిర్వహించుకునేవారికే స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేయడంతో అలజడి మొదలైంది. లీజుకిచ్చినవారు.. అమ్ముకున్నవారు పాగా వేసేందుకు ప్రయత్నించసాగారు. ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని సీఐఈ ఎంఎస్‌ఎంఈ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

2015తో లీజు గడువు పూర్తి

2015డిసెంబరు 31తో లీజు ముగిసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అద్దెలు చెల్లించాల్సిన అవసరంలేదని పరిశ్రమల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రి, పాఠశాల, ‘డబుల్‌’ ఇళ్లకు స్థలం కేటాయించాలని సర్కారుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతిపత్రం ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకులు తమకే కనీస ధరకు స్థలాలను కేటాయించాలని నివేదించారు.

అడుగు పడలే.. కబ్జాలు ఆగలే

  • బంజారాహిల్స్‌లో రూ.120 కోట్ల విలువైన భూమిపై ఓ రౌడీషీటర్‌ కన్నేశాడు. వారసుడినంటూ దొంగపత్రాలతో నాటకమాడాడు. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.
  • అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఒకే స్థలాన్ని 10-15 మందికి విక్రయించటమే కాదు.. ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్న మాయగాళ్లున్నారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు ఇప్పటికీ పోలీస్‌ స్టేషన్లు, న్యాయస్థానాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

భూ అక్ర మార్కులకు పెట్టుబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలే. బండ్లగూడ మండలంలో రోజూ నాలుగైదు చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించటం నిత్యకృత్యమైందంటున్నారు రెవెన్యూ అధికారులు. ఆసిఫ్‌నగర్‌, షేక్‌పేట్‌, ఖైరతాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ స్థలాలను కాపాడటం సవాల్‌గా మారింది. ఫిలింనగర్‌లోని రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో 6 నెలల వ్యవధిలో సుమారు 30 సార్లు బోర్డులు ఏర్పాటు చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

ఎందుకీ పరిస్థితి

ఏటా విస్తరిస్తున్న మహానగరంలో స్థలాలకు విలువ పెరుగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు క్రమంగా అన్యాక్రాంతం అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ పరిధిలో సర్కారు స్థలాలను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2010లో జియోట్యాగింగ్‌ పద్ధతిలో వాటి సంరక్షణకు సాంకేతికతను ఉపయోగించాలని భావించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా 15-30 రోజుల లోపు అంతర్జాలంలో వాటి పరిస్థితి తెలుసుకోవచ్చు. ప్రారంభంలో ఆర్భాటం చేసి పక్కనపెట్టేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి జియోఫెన్సింగ్‌, జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది జూన్‌లో 3 జిల్లాల కలెక్టర్లు, బల్దియా కమిషనర్‌, దేవాదాయశాఖ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమన్వయంతో ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టుల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల వివాదాలపై దృష్టి సారించాలన్నారు.

  • ఏడాది వ్యవధిలో నమోదైన భూఆక్రమణ కేసులు 100-110
  • షేక్‌పేట్‌ రెవెన్యూ మండలంలోనే 30-40
  • నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి స్వాహా చేసిన సొమ్ము రూ.750 కోట్లు

ఇదీ చదవండి:వింత ఆచారం.. తేళ్లతో భక్తుల పూజలు!

ABOUT THE AUTHOR

...view details