తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల రీ-సర్వే పైలట్‌ ప్రాజెక్ట్ ఎలా జరిగింది..? - land resurvey pilot project in takkellapadu village

ఏపీలోని కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు.. జగన్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర సర్వేని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసింది ఈ గ్రామంలోనే. భూములు, ఇళ్ల స్థలాలు, స్థిరాస్తులన్నింటి సర్వే పూర్తి చేసిన ప్రభుత్వం..ప్రాజెక్టును ఏపీ వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ తరుణంలో తక్కెళ్లపాడులో అసలు రీ సర్వే ఎలా జరిగింది...? ఫలితాలు ఎలా ఉన్నాయి...? అక్కడి రైతులు, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం.

land resurvey pilot project results in takkellapadu
భూముల రీ-సర్వే పైలట్‌ ప్రాజెక్ట్ ఎలా జరిగింది..?

By

Published : Dec 21, 2020, 7:49 AM IST

భూముల రీ-సర్వే పైలట్‌ ప్రాజెక్ట్ ఎలా జరిగింది..?

భూముల సమగ్ర రీ సర్వేను చేపట్టిన ఏపీ ప్రభుత్వం... తొలుత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేసింది. తెలంగాణ నుంచి వేరుచేస్తూ ఏపీ సరిహద్దు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతున్నందున.. సర్వే కోసం ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో నాటి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాశ్​ చంద్రబోస్‌ రీ-సర్వేను ప్రారంభించారు. జీపీఎస్ ఆధారిత అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో కొలతలు తీసుకున్నారు. జగ్గయ్యపేట తహశీల్దారు కార్యాలయంలో ఓ బేస్‌స్టేషన్‌, తక్కెళ్లపాడులో ఓ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కొలతల కోసం జీపీఎస్ ఆధారంగా పనిచేసే రోవర్లను, బేస్‌స్టేషన్‌, కంట్రోల్‌ రూం వ్యవస్థలను అనుసంధానించారు. శిక్షణ తీసుకున్న సర్వే సిబ్బందితో సర్వే ప్రక్రియ ప్రారంభించి.. పొలాలు, ఇళ్లస్థలాల వివరాలను డిజిటల్‌ మ్యాప్‌ల రూపంలో కంప్యూటరీకరించారు.

డిజిటల్ విధానంలో కొలతలు...

గ్రామంలోని ప్రతి నివాసాన్ని, ఇంటి స్థలాలను రోవర్లతో డిజిటల్ విధానంలో కొలతలు వేశారు. యజమాని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి..ఇంటి హక్కుల టైటిల్స్ సిద్ధం చేశారు. ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఎలాంటి ధ్రువీకరణలేని వారికీ సదరు ఆస్తులపై హక్కులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇళ్లు, ఇంటి స్థలాలపై తమ పేరిట హక్కులు కల్పించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన సర్వే నెంబర్లు...

ప్రయోగాత్మక రీ-సర్వేతో పెరిగిన పొలాల్లో సర్వే నెంబర్లూ పెరిగాయి. తక్కెళ్లపాడులో గతంలో 150 సర్వే నెంబర్లు ఉండగా రీ-సర్వే తర్వాత వీటి సంఖ్య 640కి చేరింది. మొదటి నుంచి వస్తున్న సర్వే నెంబర్లకు అనుబంధంగా మ్యూటేషన్‌ చేయించుకున్న రైతులు... 1, 2, A లేదా B పేర్లతో పట్టాలు పొందారు. దీనివల్ల సర్వే నెంబర్లు పెరిగాయి. గ్రామంలో ఎక్కువ మంది రైతుల పొలాల విస్తీర్ణం సరిగ్గానే తేలింది. కొందరి పొలాల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు కనిపించడంతో.. అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనుకుంటే కొత్త సమస్యలు వస్తున్నాయని కొందరు రైతులు అంటున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఈ తరహా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తక్కెళ్లపాడు రైతులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనం:వందేళ్ల తర్వాత ఏపీలో భూముల సర్వే.. నేడు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details