తెలంగాణ

telangana

ETV Bharat / city

భూమి అధీనంలో ఉన్నవారికే హక్కులు... - telangana land regularization scheme

తెల్లకాగితాలపై ఒప్పందాలతో జరిగిన భూ లావాదేవీల క్రమబద్ధీకరణకు అనుమతించిన ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 2014 జూన్‌ రెండో తేదీకి ముందు జరిగిన సాదాబైనామాలను మాత్రమే అనుమతించనుండగా.. ప్రస్తుతం భూమి అధీనంలో ఉన్నవారికే(కబ్జా దారు) హక్కులు కల్పించనున్నారు. దాఖలైన దరఖాస్తుపై తహసీల్దారు నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టనున్నారు. కొనుగోలుదారుడు సమర్పించిన ఒప్పంద పత్రం చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం సదరు భూమి సరిహద్దు రైతుల వాంగ్మూలం కూడా నమోదు చేయనున్నారు. విక్రయించిన రైతు వాంగ్మూలం క్రమబద్ధీకరణ ప్రక్రియలో కీలకమైనప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఈ ఒప్పందం వాస్తవమో కాదో తేల్చుతారని రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

land regularization in telangana
భూమి అధీనంలో ఉన్నవారికే హక్కులు

By

Published : Oct 19, 2020, 7:47 AM IST

భూ లావాదేవీల క్రమబద్ధీకరణకు అనుమతించిన ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భూమి అధీనంలో ఉన్నవారికే(కబ్జా దారు) హక్కులు కల్పించనున్నారు. 2016లో చేపట్టిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6.18 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలారు. ప్రస్తుతం మరోమారు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారూ వరుస కట్టే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం, భూ దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్న నేపథ్యంలో ఇక ముందు సాదాబైనామాలకు అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మార్గదర్శకాలు ఇలా..

  • ఐదెకరాల లోపు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఐదెకరాలకు మించి జరిగిన ఒప్పందాలకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
  • కొనుగోలుదారు ఆధార్‌ నంబర్‌తోపాటు 25 అంశాలతో కూడిన దరఖాస్తు పత్రాన్ని నింపాలి.
  • విక్రయదారుడి పూర్తి వివరాలు కూడా తప్పక పేర్కొనాలి.
  • భూమికి సంబంధించి పట్టా పాసుపుస్తకం, సెల్‌ఫోన్‌ నంబర్లు పేర్కొనాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాలను మాత్రమే పరిష్కరిస్తారు.
  • దరఖాస్తులో రాసిన సమాచారం అంతా నిజమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి.
  • దరఖాస్తులు మీసేవా కేంద్రాల ద్వారా ఈ నెల 31వ తేదీలోపు సమర్పించాలి.

ఆ గ్రామాలకు ప్రత్యేక అవకాశం

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాద్‌ మహా నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా), పలు ఇతర పురపాలక సంఘాల పరిధిలో ఉన్న గ్రామాల్లో క్రమబద్ధీకరణకు అనుమతులు లేవు.

ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ఆరు జిల్లాల్లోని 26 మండలాలకు చెందిన పలు గ్రామాల్లో సాదాబైనామాలకు ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అవకాశం కల్పించింది.

ఆ ఆరు జిల్లాల పరిధిలోని మండలాలు- గ్రామాలు ఇవీ

జిల్లా: రంగారెడ్డి

ఫరూక్‌నగర్‌ మండలం- అలిసాబ్‌గూడ, బుచ్చిగూడ, దోసల్‌, ఎలికట్ట, కొద్దన్నగూడ, మొగలిగిద్ద, నాగులపల్లె, రంగసముద్రం, సూర్యారావుగూడ, వెలిజెర్ల

యాచారం మండలం- యాచారం

పూర్తిగా ఉన్న మండలాలు: చేవెళ్ల, కందుకూరు, కొత్తూరు

జిల్లా: సంగారెడ్డి

హత్నూర్‌ మండలం- అక్వంచగూడ, బోర్పాట్ల, చందపూర్‌, చింతల్‌చెరు, దౌల్తాబాద్‌

పూర్తిగా ఉన్న మండలాలు: గుమ్మడిదల, జిన్నారం, కంది, సంగారెడ్డి

జిల్లా: సిద్దిపేట

మర్కూక్‌ మండలం- దామరకుంట, కర్కపట్ల, మర్కూక్‌, పాములపర్తి

పూర్తిగా ఉన్న మండలాలు: ములుగు, వర్గల్‌

యాదాద్రి జిల్లాలో మండలాలు: బీబీనగర్‌, బొమ్మల రామారం, భువనగిరి, చౌటుప్పల్‌, పోచంపల్లి

మెదక్‌ జిల్లాలో మండలాలు: మనోహరాబాద్‌, నర్సాపూర్‌, శివంపేట, తూప్రాన్‌

మేడ్చల్‌ జిల్లాలో మండలాలు: దిండిగల్‌/గండిమైసమ్మ, ఘట్‌కేసర్‌, కీసర, మేడ్చల్

ABOUT THE AUTHOR

...view details