వికారాబాద్ జిల్లాలో సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను విస్తీర్ణంతో సహా గతంలో నమోదు చేశారు. ఏయే సర్వే నంబర్లతోనైతే దస్త్రాల్లో అదనపు విస్తీర్ణం నమోదు చేసి ఉందో(పాస్ పుస్తకాల ద్వారా) వాటి మ్యుటేషన్లు ప్రస్తుతం సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతో భూ యాజమాన్య హక్కుపై సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లను సక్రమంగా నమోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 నుంచి వెయ్యి ఎకరాల భూమి అదనంగా రికార్డుల్లో నమోదైనట్లు తెలుస్తోంది.
ఇకనైనా పరిష్కారం అయ్యేనా?
జిల్లాలోని 18 మండలాలు, 565 గ్రామ పంచాయతీల్లో 4.83 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 2.26 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు. నాలుగు రెవెన్యూ డివిజన్లలోనూ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. భూమి సరిహద్దుల విషయమై ఇబ్బందులు లేకపోయినా, నేటికీ పట్టాలు లేని వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాని భూ సమస్యలు... కొత్త రెవెన్యూ చట్టం ద్వారానైనా పరిష్కారమవుతాయేమోనని ఎదురు చూస్తున్నారు.