పట్వారీ, వీఆర్వో వ్యవస్థలు ఏళ్లతరబడి కొనసాగించిన తప్పులు.. భూ యజమానులకు శాపంగా మారాయి. భూదస్త్రాల ప్రక్షాళనకు (ఎల్‌ఆర్‌యూపీ) ప్రభుత్వం 2017లో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామస్థాయిలో సభలు ఏర్పాటుచేసి 1బి నకళ్లను రైతులకు ఇచ్చి దస్త్రాలను నవీకరించింది. సమయం లేకపోవడంతో సిబ్బంది ఎల్‌ఆర్‌యూపీ సమాచారంతో పాటు అప్పటి వరకు అమల్లో ఉన్న వెబ్‌ల్యాండ్ (2011-2014 మధ్య రూపొందించిన పహాణీ సమాచారం) సమాచారాన్ని ఎక్కించారు. అనంతరం అవగాహన ఉన్న రైతులు మాత్రమే తమ భూ రికార్డులను ఎప్పటికప్పుడు సరిచేయించుకున్నారు. చాలామంది రైతులది పాత సమాచారమే ఎల్‌ఆర్‌యూపీ సాఫ్ట్‌వేర్‌లోకి చేరింది. అక్కడి నుంచి ఎలాంటి మార్పులకు వీల్లేని టీఎస్‌ఐఎల్‌ఆర్‌ఎంఎస్ (ధరణి) పోర్టల్‌లోకి చేరింది.
నాటి సిబ్బంది తప్పిదమే కారణం
రాష్ట్రంలో 1936లో నిర్వహించిన సర్వే సమాచారం ఆధారంగా 2014 ముందు వరకు పహాణీలు, దస్త్రాలు చేతిరాతతో కొనసాగాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరికి తోచినట్లు వారు విస్తీర్ణాలు, సర్వే నంబర్లు వేయడమే ఇప్పుడు సమస్యలకు కారణమైంది. తరాలు మారడంతో యజమానులు మారారు. సర్వే నంబర్ల పక్కన బై నంబర్లు వేసుకుంటూ వచ్చారు. సమాచారం అప్‌లోడ్ చేసే సమయంలో పోర్టల్ అనుమతించని కారణంగా సిబ్బంది చాలా సర్వే నంబర్లు, ఖాతాలను తొలగించారు.