రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతా భూసంబంధిత ఫిర్యాదులకు మాధ్యమంగా మారింది. తమ భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు మంత్రికి ట్వీట్ చేశారు. వాటిని పరిష్కరించాల్సిందిగా కేటీఆర్.. ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. భూరికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి పలు చోట్ల వివిధ కారణాల వల్ల భూసంబంధిత సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల పార్ట్ బీలో ఉండడం, మరికొన్ని చోట్ల మ్యుటేషన్ పూర్తి కాకపోవడం, ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
పార్ట్ బీలో ఉన్నా, తమ పేరిట మ్యుటేషన్ కాకపోయినా రైతుబంధు సాయం అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. తాజాగా వానాకాలం రైతుబంధు సాయాన్ని ఈ నెల 15 నుంచి జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పార్ట్ బీలోని భూములు పార్ట్ ఏలోకి చేరే కటాఫ్ తేదీని జూన్ పదిగా నిర్ణయించారు. ఆలోగా తమ సమస్యను పరిష్కరించుకుంటే రైతుబంధు వస్తుందన్న ఉద్దేశంతో పలువురు ప్రయత్నిస్తున్నారు.