కొందరేమో ‘డబుల్ రిజిస్ట్రేషన్ల’తో దందా చేస్తున్నారు. మరికొందరేమో ఖాళీ స్థలాలను చూపించి ఇవి మావే అంటూ అమాయకులకు అంటగడుతున్నారు. నకిలీ సేల్ డీడ్ల, డబుల్ రిజిస్ట్రేషన్లతో అక్రమార్కులు అమాయకులకు గాలం వేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో 40 ఎకరాలను రూ.56 కోట్లను విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును రట్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. మరికొన్ని ముఠాల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
గతంతో పోలిస్తే శివారుల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదీ కాకుండా ఎక్కువ మంది భూములు, ప్లాట్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే, అక్కడ ఉండే డాక్యుమెంట్ రైటర్ల సాయంతో దానికి సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. పొజిషనల్ ఉన్నవారి కంటే ముందు కొనుగోలు చేసిన లేదా అసలు పట్టాదారుల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. వీటితో సేల్‌డీడ్‌లను తయారు చేయించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. పొజిషన్ తీసుకునేందుకు ఆ స్థలం దగ్గరికెళ్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నవారికి తెలిసి గొడవకు దిగితే పోలీసులు, రాజకీయ నాయకులతో ఒత్తిడి తెచ్చి ‘సెటిల్‌మెంట్’ చేసుకుంటున్నారు. కోర్టుల్లో కేసులు పెడతామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే ఆ స్థలాన్ని అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
అసలు పత్రాలను చూపించకుండా..
స్థిరాస్తి వ్యాపారం జోరు మీదున్న శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తున్నారు. అసలు యజమాని ఎక్కడుంటాడో ఆరా తీస్తారు. స్థానికంగా ఉండరని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగుతారు. ఆ భూములకు సంబంధించిన సేల్‌డీడ్ నకలును సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకుంటున్నారు. వారి నుంచి తాము కొనుగోలు చేసినట్లు నకిలీ సేల్ డీడ్‌ను సృష్టించి మార్కెట్‌లో అమ్మకానికి పెడుతున్నారు. అసలు పత్రాలను చూపించకుండా నకలును మాత్రమే చూపించి బోల్తా కొట్టిస్తున్నారు. దూరం నుంచి భూములు చూపించి అడ్వాన్స్ తీసుకుని ఒప్పందం చేసుకుంటున్నారు. సేల్‌డీడ్, ఇతరత్రా అసలు పత్రాలను చూపించమంటే ముఖం చాటేస్తున్నారు. లేదంటే మోసం బయటపడే వరకు డబ్బులు తీసుకుంటూనే ఉంటారని సైబరాబాద్ పోలీసులు వివరిస్తున్నారు.