Telangana Irrigation Projects : ప్రభుత్వ ప్రాధాన్య రంగమైన నీటిపారుదలకు భూసేకరణ కీలక సమస్యగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, ఎల్లంపల్లి, సీతారామ, చనాకా-కొరాటా, డిండి ప్రాజెక్టుల పనులకు భూసేకరణ, నిధుల బకాయిలు ఆటంకంగా మారాయి. వచ్చే ఏడాది 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నీటిపారుదల శాఖ నిర్దేశించుకుంది. ఈ వానాకాలంలోనూ లక్ష్యం మేరకు సాగునీరు అందాలంటే ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సి ఉందని క్షేత్రస్థాయి ఇంజినీర్లు చెబుతున్నారు. మరోవైపు పనులు వేగంగా జరగాల్సిన తరుణం కూడా మించిపోతోంది. సాధారణంగా డిసెంబరు నుంచి జూన్ రెండో వారం మధ్యనే పనులు వేగంగా చేపడతారు. ఈ సమయంలో పంటల సాగు తక్కువగా ఉండటం, వర్షాలు ఉండకపోవడం వల్ల మట్టి, సిమెంటు పనులు చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం నిధులు విడుదల చేసినా చివరి దశలో ఉన్న పనులు తప్ప మిగిలిన నిర్మాణాల్లో జాప్యం తప్పదని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆయకట్టు మురవాలంటే..కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టుల పరిధిలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నా ఆయకట్టుకు మాత్రం సాగునీరు చేరని పరిస్థితులు ఉంటున్నాయి. గతేడాది నుంచి చెరువులు నింపుతూ నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ఎలాగైనా ఆయకట్టుకు నీరందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఆయకట్టుకు నీరందించేందుకు తక్షణం దాదాపు 2,600 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు వెయ్యి ఎకరాల వరకు నీటిపారుదల శాఖకు రెవెన్యూ శాఖ(భూసేకరణ) అందజేయాల్సి ఉన్నట్లు అంచనా.
పలు ప్రాజెక్టుల కింద పరిస్థితి ఇలా..ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కాళేశ్వరం పరిధిలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ల కింద 1,600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.100 కోట్ల వరకు అవసరం. ప్రాజెక్టు పరిధిలో నాలుగో లింకు కింద మధ్యమానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు 5.89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మధ్యమానేరు పరిధిలో మాత్రమే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఉంది. ఐదో లింకులో కొమరవెల్లి మల్లన్నసాగర్ నుంచి సింగూరు వరకు 3.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ కూడా కొత్త డిస్ట్రిబ్యూటరీలను నిర్మించాల్సి ఉంది. అదనపు(మూడో) టీఎంసీకి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత భూసేకరణ చేయాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి కర్వెన జలాశయం వరకు ప్రధాన కాల్వలకు భూసేకరణ, జలాశయాల కింద పునరావాసానికి నిధులు చెల్లించాల్సి ఉంది. రూ.20 కోట్ల వరకు బకాయిలున్నాయి.