Lalithamma: సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు కాదు.. స్పందించే గుణమంటారు లలితమ్మ. ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కాశిపల్లె. లింగ వివక్షని చూడ్డమే కాదు, ఆమె కూడా దాని బాధితురాలే. పైచదువులకు వెళ్లాలనుకున్నా పదో తరగతితో ఆపాల్సి వచ్చింది. గాంధీ గ్రామీణాభివృద్ధి సంస్థలో బాల్వాడీగా పనిచేసేందుకు 1990లో ములకలచెరువు వచ్చారు. అక్కడే గోవిందప్పతో పరిచయం.. ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగం చేసేవారు. కులాలు వేరైనా భావాలూ, మనసులూ కలవడంతో పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరూ కలిసి మదనపల్లెలో 1992లో పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(పోర్డ్) స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. తర్వాత గోవిందప్ప దళితుల హక్కుల కోసం పోరాడాలనే లక్ష్యంతో వేరే వేదికను ఎంచుకోగా, 1997 నుంచి ఈ సంస్థను అన్నీ తానై నడిపిస్తున్నారు లలితమ్మ.
బెదిరింపులు ఎదురైనా.. మొదట్లో తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై అవగాహన కల్పించారు. 5-18 మధ్య వయసు వాళ్లంతా చదువుకోవాలి, బాలికా విద్య మరీ ముఖ్యమని చెప్పడమే కాకుండా బడి ఈడు పిల్లలతో బాల సంఘాలు ఏర్పాటుచేశారు. వాళ్లకి చదువు గురించి, బాల్య వివాహాల నష్టాల గురించి పాటలూ, నాటకాల రూపంలో చెప్పేవారు. గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నా, పిల్లలెవరైనా బడి మానేసినా సమాచారం ఇవ్వాలని కోరారు.
అంగన్వాడీ టీచర్లనీ దీన్లో భాగం చేశారు. ‘ఆర్థిక, సామాజిక వెనకబాటు కారణంగా ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు, బాల కార్మికులు ఎక్కువ. తొమ్మిదో తరగతి మొదలు ఇంటర్ చదివే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. మేనరికాలు ఎక్కువ. సమాచారం తెలియగానే వెళ్లి తల్లిదండ్రులకు, పిల్లలకూ కౌన్సెలింగ్ ఇస్తాం. ఆర్థిక, ఆరోగ్య అనర్థాలను వివరిస్తాం. కొందరు అంగీకరించి పెళ్లి వాయిదా వేసుకుంటారు. ఒక్కోసారి ఆడపిల్ల తరఫు అంగీకరించినా అబ్బాయి తరఫువాళ్లు అభ్యంతరం చెబుతారు. కొందరు బెదిరించేవారు.
అలాంటపుడు వైద్యులూ, మండల స్థాయి అధికారులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. ఇన్ని చేసినా వేరేచోటకి వెళ్లి పెళ్లి చేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ల చదువులు ఆగిపోకుండా జాగ్రత్తపడతాం. బాల కార్మికుల విషయంలోనూ ఇదే చేస్తాం. ఇలాంటి బాలల్ని దాదాపు అయిదేళ్లపాటు పర్యవేక్షిస్తాం. ఎక్కువగా పేదరికమే వీటికి కారణం. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు, పింఛన్ లాంటివి అందేలా చూస్తాం’ అని చెబుతారు లలితమ్మ.
ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 300 బాల్య వివాహాలను నిలిపివేశారు. 2,200కు పైగా బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించారు. వీళ్లలో చాలామంది డిగ్రీ చేసి ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. బాలికలు, మహిళలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లోని గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. లలితమ్మ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆమెను ‘ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం- ఫీజు రీయింబర్స్‌మెంట్’ ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా నియమించింది.
అమెరికా వేదికగా..2015లో భర్త గోవిందప్ప అనారోగ్యంతో చనిపోయినా సేవా కార్యక్రమాల్ని ఆపలేదు లలితమ్మ. మరోవైపు ఒక్కగానొక్క కొడుకునీ ఇంజినీరింగ్ చదివించారు. ఈమె చేస్తున్న కార్యక్రమాల్ని గుర్తించిన సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సీడబ్ల్యూఎస్), వాటర్ ఎయిడ్ ఇండియా, అమెరికాకు చెందిన చైల్డ్ రైట్స్ యు (క్రై) సంస్థలు ఆర్థిక చేయూతనిస్తున్నాయి. ‘క్రై’ ఆధ్వర్యంలో గత నెల అమెరికాలో నిర్వహించిన సదస్సుల్లో పాల్గొని తమ సేవా కార్యక్రమాల్ని వివరించారు లలితమ్మ.
స్థానికంగానూ పోర్డ్‌కు వదాన్యులు విరాళాలు అందిస్తున్నారు. హైపర్ వెర్జ్ కంపెనీ సహకారంతో ఏటా ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన కొందరు విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బాలల హక్కుల చట్టాలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలన్నదే తన జీవితాశయమని చెబుతారు లలితమ్మ.