ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నడిబొడ్డున లాల్‌బహుదూర్ స్టేడియాన్ని నిర్మించారు. 1960 మార్చి 24న నీలం సంజీవ రెడ్డి ఈ మైదానాన్ని ప్రారంభించారు. మొదట పతే మైదానంగా పేరు ఉన్నా.. తర్వాత లాల్ బహుదూర్ స్టేడియంగా మార్చారు. ఇక్కడ సాధన చేసిన ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జయసింహా, పటోడి, అజారుద్దీన్, వెంకటపతిరాజుతో పాటు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పుల్లెల గోపిచంద్ వంటి వారు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ మైదానం రాజకీయ, ప్రైవేట్ కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేక ప్రస్తుతం ఈ స్టేడియం కళావిహీనంగా తయారైంది.
బహిరంగ సభల వల్ల..
రాజకీయ పార్టీల బహిరంగ సభలకు, ప్రైవేట్ సంస్థల ఫంక్సన్స్‌కు క్రీడా ప్రాంగణాన్ని ఇవ్వడం వల్ల పోటీల నిర్వహణ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఫలితంగా యువ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైదానంలో డ్రెస్సింగ్ రూం, శౌచాలయాలు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. బహిరంగ సభల ఏర్పాట్ల వల్ల మైదానం స్వరూపాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.