తెలంగాణ

telangana

ETV Bharat / city

సాగర్​ వద్ద 'ప్రాణాలకు కంచె'లా పహారా కాస్తున్న లేక్​ పోలీసులు - ట్యాంక్​బండ్​ వద్ద ఆత్మహత్య చేసుకునే వారిని కాపాడుతున్న లేక్​పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసేవాళ్లను లేక్ పోలీసులు కాపాడుతున్నారు. జీవితంపై విసుగు చెంది తనువు చాలించాలనుకునేవారిపై నిఘా పెట్టి రక్షిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో 24 గంటలపాటు విధులు నిర్వహిస్తున్న లేక్ పోలీసులు.... బాధితులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.

Lake
Lake

By

Published : Aug 15, 2021, 6:52 AM IST

Updated : Aug 15, 2021, 3:03 PM IST

హైదరాబాద్‌లో నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లకు హుస్సేన్‌సాగర్‌ అడ్డగా మారింది. ఇలాంటి వాళ్లను సకాలంలో గుర్తిస్తున్న లేక్ పోలీసులు...... వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నారు. ట్యాంక్‌బండ్, సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక బృందాలతో నిరంతం నిఘా ఉంచుతున్నారు.

సాగర్​ వద్ద 'ప్రాణాలకు కంచె'లా పహారా కాస్తున్న లేక్​ పోలీసులు

దీనికోసం లేక్ పోలీసులు... ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు నిఘా పెట్టారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే వాళ్లు వెంటనే నీళ్లలోకి దూకడానికి ధైర్యం సరిపోక పరిసరాల్లోనే తచ్చాడుతుంటారు. వాళ్ల కదలికలు, ప్రవర్తన, వేషధారణ గమనించి, అనుమానం రాగానే పోలీసులు నిఘా పెడతారు. ఆత్మాహత్య చేసుకోడానికి రెయిలింగ్ వద్దకు వెళ్లగానే వెంటనే పట్టుకొని లేక్ పోలీస్ స్టేషన్​కు తరలిస్తున్నారు. బాధితులకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని సమాచారం ఇస్తున్నారు.

ట్యాంక్​బండ్​పై నుంచి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వందల మందిని లేక్ పోలీసులు కాపాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 285 మందిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. 2015లో 207 మందిని, 2016లో 222మందిని, 2017లో 168మందిని, 2018లో 344మందిని, 2019లో 323మందిని, 2020లో 405మందిని కాపాడారు. కొంతమంది మాత్రం లేక్ పోలీసుల కన్నుగప్పి ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత ఏడేళ్లలో హుస్సేన్​సాగర్​లో దూకి 190 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ తక్కువగా ఉంటుంది. పోలీసులు లేని ప్రాంతంలో చీకట్లో నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

సాగర్ చుట్టూ 5 కిలోమీటర్ల పైనే దారి ఉంటుంది. ఏ ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటారనేది కనుక్కోవడం లేక్ పోలీసులకు కష్టమే. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, సంజీవయ్య పార్కు సమీపంలో గస్తీ నిర్వహిస్తుంటారు. సంజీవయ్య పార్కు వైపు సరైన రక్షణ లేదు. ఈ విషయాన్ని లేక్ పోలీసులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లేక్​పోలీస్ స్టేషన్​లో సిబ్బంది కొరత ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం దాదాపు 50మంది పోలీసులు ఉండగా... మరో 20 మంది ఉంటే హుస్సేన్​ సాగర్​ చుట్టూ నిఘా పెట్టే అవకాశం ఉంది.

మహిళలు, యువతులపై ఆకతాయిల వేధింపులు ఎక్కువవుతుండటంతో 2003లో లేక్ పోలీస్ స్టేషన్​ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్​లో ఆత్మహత్యల నివారణపై పోలీసులు దృష్టి పెట్టారు. హుస్సేన్ సాగర్​లో దూకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల సంఖ్య లేక్ పోలీసుల కృషి వల్ల తగ్గుతూ వస్తోంది. మరింత కృషి చేసి ఈ సంఖ్యను సున్నా చేయడమే లక్ష్యమని లేక్ పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:సర్వాంగసుందరంగా ట్యాంక్​బండ్.. ట్వీట్ చేసిన కేటీఆర్

Last Updated : Aug 15, 2021, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details