తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccination: గడువు ముగిసినా దొరకని రెండో డోస్​.. జనాలు కన్​ఫ్యూజ్​​..!​ - vaccination updates

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వారానికి ఐదు రోజులే కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తుండటం... మరోవైపు 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని కేంద్రం ప్రకటించటంతో.. ప్రైవేటులోనూ టీకాలు తీసుకునే వారి సంఖ్య తగ్గటంతో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగం తగ్గింది. మరీ ముఖ్యంగా రెండో డోస్ కోసం తిప్పలు తప్పటం లేదు. మొదటి డోస్ తీసుకుని గడువు ముగిసినా రెండో డోస్ దొరకక వందల మంది టీకాల కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి.

lake-of-second-doses-in-telangana
lake-of-second-doses-in-telangana

By

Published : Jul 17, 2021, 3:34 PM IST

కరోనా మహమ్మారి రోజుకో కొత్త రూపం సంతరించుకుంటోంది. ప్రజలపై మరింత ప్రభావాన్ని చూపుతోంది. సార్స్ కొవి-2లో డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుండగా... ఇప్పుడు డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను కాపాడుకునే ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సినే అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఉద్ఘాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి తెలంగాణలో టీకా పంపిణీ కార్యాక్రమం ప్రారంభం కాగా... ఏప్రిల్ నుంచి వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల రాష్ట్రంలో టీకా పంపిణీ మందకోడిగా సాగుతోంది. అవసరమైన మొత్తంలో టీకాల లభ్యత లేకపోవటం, మొదటి డోస్​కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం సహా అనేక కారణాలు టీకా పంపిణీపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

తగినమొత్తంలో అందట్లే..

జూన్​ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించారు. మొదటి పక్షం రోజుల్లో సాగినంత జోరుగా... ఆ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగకపోవటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో బుధ, ఆదివారాలు మినహాయించి కేవలం ఐదు రోజులు మాత్రమే కొవిడ్ టీకాలు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంలో ఉచితంగా టీకాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రైవేటులో కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీనికి తగ్గట్టే ప్రభుత్వానికి తగిన మొత్తంలో టీకాలు అందటం లేదని అధికారులు చెబుతున్నారు. వెరసి కొవిడ్ వ్యాక్సినేషన్ అనుకున్నంత వేగంగా సాగటం లేదు. మరీ ముఖ్యంగా రెండో డోస్ టీకాలు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

పీహెచ్​సీల ముందు క్యూలు..

ఎక్కువ మందికి కనీసం ఒక్క డోస్ అయినా టీకాలు అందిస్తే పాక్షికంగా రక్షణ లభించే అవకాశం ఉందన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిషీల్డ్ టీకా రెండో డోస్ సమయాన్ని 14 నుంచి 16 వారాలకు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో జులై నెలాఖరు నాటికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో దాదాపు 25 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందని అధికారులే ఇటీవల ప్రకటించారు. అయితే ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు టీకా ఇచ్చింది కేవలం 710654 మందికి మాత్రమే. అనేక మంది రెండో డోస్ కోసం స్థానికంగా ఉన్న టీకా కేంద్రాల ముందు క్యూ కడుతున్నారు. రోజుకి ఒక్కో పీహెచ్ సీలో వంద మందికి మాత్రమే రెండో డోస్ ఇస్తుండటం వల్ల మిగతా వాళ్లంతా టీకా దొరకక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.

50 శాతం తగ్గాయి...!

ఇక రాష్ట్రంలో జూన్ మొదటి 15 రోజుల్లో మొత్తం 2359527 డోసుల టీకాలు అందించారు. అందులో 758197 డోసులు ప్రైవేటులో పంపిణీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో కలిపి రోజుకి 147470 డోసుల టీకాలు అందించారు. అందులో ప్రైవేటు ఇచ్చినవి రోజుకి 47387 డోసులు. ఇక జులైలో మొదటి పదిహేను రోజుల్లో ఇచ్చింది కేవలం 1909179 అందులో ప్రైవేటులో పంపిణీ చేసినవి 443254 డోసులు. ప్రభుత్వ ప్రైవేటులో కలిపి జులై మొదటి పక్షం రోజుల్లో రోజుకి 112304 డోసులు ఇవ్వగా... అందులో ప్రైవేటు వాటా కేవలం 27703 డోసులు మాత్రమే. జూన్​తో పోలిస్తే జులైలో మొత్తం కొవిడ్ టీకాల పంపిణీలో నాలుగున్నల లక్షల డోసులు తగ్గాయి. ముఖ్యంగా ప్రైవేటులో అయితే ఏకంగా 50 శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిపోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అనుమానానలతో అయోమయం...

ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం తగ్గటం... రెండో డోస్ దొరకకపోతుండటం.. ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గడువు ముగిసినా టీకా వేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అన్న అనుమానాలతో అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. స్పందించి రెండో డోస్ టీకాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:అఫ్గాన్​ మహిళకు పునర్జనిచ్చిన బెంగళూరు వైద్యులు!

ABOUT THE AUTHOR

...view details