అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు శాసన మండలి, శాసనసభ... రెండూ వేర్వేరుగా సమావేశం అవుతాయి. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉభయ సభల ప్రాంగణాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచడం, థర్మల్ స్కానర్ కెమెరాలు సహా అవసరమైన పరికరాలను సిద్ధం చేశారు. అసెంబ్లీ ప్రాంగణాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు.
నెగిటివ్ వస్తేనే సభలోకి..
సభ్యులు సహా అధికారులు, సిబ్బందికి మూడు రోజులుగా కొవిడ్ నిర్ధరణ నిర్వహించారు. నెగెటివ్ ఉన్న వారికి మాత్రమే లోనికి అనుమతిస్తారు. సభాపతులు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది ఇప్పటికే కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. సమావేశాలు కొనసాగుతున్నన్ని రోజులు పరీక్షా కేంద్రాలు కొనసాగనున్నాయి. ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందితోపాటు అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచుతారు. సభలో సభ్యుల మధ్య భౌతికదూరం పాటించేందుకు... శాసనసభలో 48 సీట్లను అదనంగా ఏర్పాటు చేశారు. సందర్శకులకు, మీడియా పాయింట్‌కు ఈసారి అనుమతించడం లేదు.
మొదటి రోజు సంతాపాలే..
ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై... మొదటి రోజు కేవలం సంతాపాలకు మాత్రమే పరిమితమవుతాయి. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉభయసభలు, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డికి శాసనసభలో సంతాపం ప్రకటిస్తారు. సంతాపాల తరువాత రెండు సభలు మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. అనంతరం రెండు సభల సభావ్యవహారాల సలహాసంఘాలు వేర్వేరుగా సమావేశమై పనిదినాలు, ఎజెండాను ఖరారు చేస్తాయి. కనీసం 19 పని రోజులు సమావేశాలను నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదనగా తెలుస్తోంది.
పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం
కరోనా పరిస్థితులు, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదం, భారీవర్షాలు-పంటనష్టం, నియంత్రిత పంటలసాగు, పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం తీరు, రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కేంద్ర వైఖరి సహా వివిధ అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్‌ల ద్వారా అమలులోకి తెచ్చిన కొన్ని బిల్లులను... ఉభయసభల్లో ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ చట్టం... బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఉభయసభల ముందుకు రానుంది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.
ఇదీ చూడండి:'మహా'లో శాంతించని కరోనా.. కొత్తగా 23వేలకుపైగా కేసులు