గాంధీ ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో 30-40 శాతం పనిచేయడంలేదు. కాపలాదారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండడం వల్ల నలుగురు ఖైదీలు తప్పించుకున్నారు. రెండేళ్ల కిందట ఇదే ఆసుపత్రి స్నానపుగది ఊచలు విరిచి మంచినీటి పైపు ఆధారంగా ఖైదీల వార్డు నుంచి పారిపోవడం సంచలనం రేపింది. తాజాగా అదే తరహా ఘటన చోటుచేసుకోవడం చూస్తే... గత అనుభవాలతో అధికారులు పాఠాలు నేర్వలేదని స్పష్టమైంది.
తీవ్రవాదులు, ఇతర భారీ నేరాల్లో శిక్ష పడిన ఖైదీలకు అనారోగ్యం తలెత్తినప్పుడు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ప్రిజనరీ వార్డులకు తరలిస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఎర్రగడ్డలోని మానసిక చికిత్స ఆలయంలో తరచూ ఏవో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నింటి వద్ద 24 గంటలపాటు పొరుగు సేవల సంస్థలు ప్రైవేటు సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. వీరిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. అన్ని ఆసుపత్రుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాసరే...అందులో 30-40 శాతం పని చేయడం లేదు.
2004లో గాంధీ ఆసుపత్రి నుంచి ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లడం సంచలనం రేపింది. పాపను ఆడిపిస్తానని తీసుకొని పారిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి తెనాలిలో పట్టుకున్నారు.