Farmers problems at Grain Purchasing Centers: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత బాగా ఉంది. ఈ దఫా ధాన్యం కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు అప్పగించింది. ఆ శాఖ రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనాలంటూ.. ‘ఇందిరా క్రాంతి పథం’(ఐకేపీ) విభాగానికి చెందిన మహిళా సంఘాలు, సహకారశాఖకు చెందిన ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’కు ఆదేశాలిచ్చింది. వాటి దగ్గర అవసరమైన యంత్రాలు, టార్పాలిన్లు లేకపోవడంతో అవి మార్కెటింగ్‌శాఖకు చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీలను అడుగుతున్నాయి. ఈ కమిటీలకు నేరుగా కొనే అధికారం లేనందున జిల్లా కమిటీలకు చెబుతున్నాయి. ఈ కమిటీలు లెక్కలన్నీ వేసి మార్కెటింగ్‌శాఖ సంచాలకుల రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నాయి. వాస్తవంగా యంత్రాలు కొనుగోలుచేసి జిల్లాలకు పంపేందుకు ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్)ను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఆ సంస్థ జిల్లా అధికారులు అడిగిన యంత్రాలను కొని ఏడు రోజుల్లోగా పంపాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలను మార్కెటింగ్ శాఖ ఆగ్రోస్‌కు పంపుతోంది
ఇప్పటికే కొన్నవి ఏమయ్యాయి?..గత నాలుగేళ్లలో 2.50 లక్షల టార్పాలిన్లు, సేకరణకు సరిపడా ఇతర యంత్రాలు కొని సేకరణ కేంద్రాలకు పంపామని, అవి ఎక్కడున్నాయో లెక్కలు చెప్పకుండా ఇప్పటికిప్పుడు కొత్తవి కావాలంటే ఎలాగని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ దఫా 6,983 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకూ 536 మాత్రమే తెరిచారు. తమకు 1,128 ధాన్యం శుభ్రపరిచే, తేమ శాతం కొలిచే యంత్రాలు కావాలంటూ ఆయా కేంద్రాల నిర్వాహకులు మార్కెటింగ్ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ధాన్యంలో చెత్త, మట్టిని తొలగించే యంత్రాలను తయారుచేసే కంపెనీలు పంజాబ్‌లో ఉన్నాయి. అక్కణ్నుంచి ఆగ్రోస్ తెప్పిస్తోంది. తేమ శాతం కొలిచే యంత్రాలు రాజస్థాన్ లేదా గుజరాత్ నుంచి తెప్పించాలి. ఇప్పటికిప్పుడు సేకరించడం ఎలా సాధ్యమని’’ అధికారులు వాపోతున్నారు.