కరోనా వైరస్‌కు ఎదురొడ్డి నిలిచి విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు దిల్లీ ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థికసాయం చేస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన పోలీసు అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది పోలీసులు మరణించారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో అత్యధికం..
వైరస్‌ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు నిద్రాహారాలు లేకుండా విధులు నిర్వహించారు. కంటెయిన్‌మెంట్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా చూసుకోవడం నుంచి కొవిడ్ మృతుల అంత్యక్రియల వరకూ నిర్విరామంగా శ్రమించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది ఏఎస్సైలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు ప్రత్యేక పోలీసు అధికారులు, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్ ఉన్నారు. వీరంతా మధ్యతరగతికి చెందినవారు, వారి పిల్లలు ఇంకా చదువుకొంటున్నారు.
ఆదుకుంటున్న ఇతర రాష్ట్రాలు..
ఫ్రంట్‌లైన్ వారియర్స్ కరోనా బారిన పడి చనిపోతే వెంటనే వారిని ఆదుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. దిల్లీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.65 లక్షల ప్యాకేజీ ఇస్తోంది. ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు, పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.10 లక్షలు, బీమా కంపెనీల నుంచి రూ.5 లక్షలు అందుతోంది. మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం రూ.25 లక్షలు అందిస్తోంది.