కరోనా ఉరుముతున్న వేళ అత్యంత ప్రధాన ఆసుపత్రుల్లోనూ సీటీ స్కానింగ్ సౌకర్యం లేకపోవడం పెద్దలోటుగా నిలుస్తోంది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సీటీ స్కాన్ పరికరాలనే అందుబాటులో ఉంచలేదు. ముఖ్యమైన ఆసుపత్రులు, జిల్లా దవాఖానాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రాంతీయ ఆసుపత్రుల సంగతి సరేసరి. కొవిడ్ నేపధ్యంలో గత ఏడాదిగా స్కానింగ్ అవసరాలు బాగా పెరిగిపోయాయని వైద్యవర్గాలకు కూడా తెలుసు. ఇప్పుడు ఫంగస్ వ్యాధులు కూడా దాడి చేస్తున్నాయి. ఈ సమయంలో సీటీ స్కాన్ చేయించకుండా చికిత్స ముందుకు కదిలే పరిస్థితి లేదు. అయినా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిజానికి ఆ పరికరాల ఖర్చు రూ.వందల కోట్లయ్యేది కూడా కాదు. ఒక్కో యంత్రం విలువ రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నెలకొల్పినా రూ.100 కోట్ల ఖర్చు దాటదు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణలో భాగంగా రూ.వేల కోట్లు ఖర్చుపెట్టడానికి అనుమతులు ఇస్తుంటే.. ఉన్నతాధికారులు మాత్రం అతి ముఖ్యమైన వైద్య పరికరాల కొనుగోలుపై దృష్టిసారించడం లేదు. దీని వల్ల రోగులకు నరకం కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడకు వెళ్లాలో తెలియక వారు అవస్థలు పడుతున్నారు.
శత‘కోఠి’ సమస్యలు...
ఈఎన్టీ వైద్యుడి వద్దకు వచ్చే రోగుల్లో సగం మందికి పైగా సైనస్ సంబంధిత సమస్యల వారే. వీరిలో ఇన్ఫెక్షన్ అంచనా వేయడానికి ఈఎన్టీ వైద్యులు తప్పనిసరిగా సాయం తీసుకునే పరీక్ష సీటీ స్కాన్. దీని ద్వారా ఎంత తీవ్రత ఉంది? ఆపరేషన్ అవసరమా? అనేది నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పార్జిల్లస్, మ్యూకర్ మైకోసిస్, క్యాండిడా తదితర ఫంగల్ ఇన్ఫెక్షన్లను అంచనా వేయడానికి కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంత అత్యవసరమైన సీటీ స్కాన్ యంత్రం కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో లేదు. ఇక్కడ స్కానింగ్ అవసరమైన వారు ప్రైవేటుకు వెళ్లి రూ.వేలు కుమ్మరించడమో.. లేదా ఉస్మానియాకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి రావడమో.. ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వస్తోంది. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి నిత్యం సుమారు 1500 పైగానే ఓపీ ఉంటుంది. ఇంతమందిలో కనీసం 30-40 శాతం మందికి సీటీ స్కాన్ ఆవసరమైనా.. 450-600 మంది అవస్థలు పడాల్సిందే. పైగా ఇక్కడ నిత్యం 20-25 వరకూ ఈఎన్టీ సర్జరీలు జరుగుతుంటాయి. వీరికి సీటీ స్కాన్ అవసరమైనా తిప్పలు తప్పవు.
ఎక్కడ చూసినా...
- నిలోఫర్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యంత్రముంది. కానీ చాన్నాళ్ల క్రితంది కావడంతో పదేపదే మొరాయిస్తోంది. ఇరవై రోజుల క్రితం పాడైన దాన్ని ఇప్పటికీ బాగు చేయించకపోవడంతో ఇక్కడి చిన్నారులకు సీటీ స్కాన్ చేయించాల్సి వస్తే ఉస్మానియాకో, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికో పంపిస్తున్నారు. ఎంత అత్యవసరమైనా స్కానింగ్ కోసం కనీసం మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే. లేదంటే ప్రైవేటు ల్యాబ్‌కు పోయి సుమారు రూ.3వేలు చెల్లించి తీయించుకోవాల్సి వస్తోంది.
- దాదాపు 600 మందికి పైగా కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న టిమ్స్‌లోనూ సీటీ స్కాన్ సౌకర్యం లేదు. ఎవరికి ఛాతీ ఇన్ఫెక్షన్ తీవ్రమైందని భావించినా.. నిర్ధారించాలంటే అందుబాటులో స్కానింగ్ సౌకర్యం లేకపోవడం తీర్చలేని లోటుగా పరిణమించింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అయితే రెండేళ్లుగా సీటీ స్కాన్ యంత్రం మూలకు పడినా పట్టించుకునే వారే లేరు. దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఎక్కడా ఈ సౌకర్యం లేకపోవడం శోచనీయమే.