రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కిట్లకు కొరత ఏర్పడింది. రోజుకు 1.30 లక్షల నుంచి 1.50 లక్షల వరకూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఆ మేరకు సరఫరా చేయలేక ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ చేతులెత్తేసింది. దిల్లీలో లాక్‌డౌన్ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటం కిట్ల కొరతకు దారితీసిందని వైద్యవర్గాలు తెలిపాయి. బుధవారానికి వైద్యఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్ష లోపు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు, లక్షన్నర లోపు ఆర్‌టీ పీసీఆర్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో.. గురువారం కొవిడ్ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందా? అనే సందేహాలు వెలువడ్డాయి. దీన్ని చక్కదిద్దేందుకు వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు వీలుగా.. అత్యవసరంగా లక్షన్నర కిట్లను అందుబాటులో ఉన్న ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసింది. ఇవి బుధవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకుంటాయనీ, గురువారం తెల్లవారేసరికి అన్ని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామని వైద్యవర్గాలు తెలిపాయి.
మూణ్నెల్లకు సరిపడా ఒకేసారి..
కిట్ల కొరత నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు అత్యవసర కొనుగోళ్లు జరపడంతోపాటు.. మూణ్నెల్లకు సరిపడేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి తాజాగా ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతిని ఇచ్చింది. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో పాటు ఆర్‌టీ పీసీఆర్ కిట్లను కూడా కొనుగోలు చేస్తారు. ముందుగా 30 లక్షల కిట్లకు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్ పిలిచింది. టెండర్‌లో అతి తక్కువ ధర వేసిన మూడు సంస్థలను ఎంపిక చేయనున్నారు. ఈ మూడింటికి కూడా కిట్ల సరఫరా బాధ్యతలను అప్పగించనున్నారు. నెలనెలా ఎంత మేరకు సరఫరా చేయాలనేది ఒప్పందంలోనే స్పష్టం చేయనున్నారు. అత్యవసర కొనుగోలులోనూ ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తున్నామనీ, సర్కారు ముందస్తు అనుమతుల మేరకే నూతన టెండర్‌కు వెళ్తున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి.