Visakha Steel Plant Agitation: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై.. 500వ రోజూ ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. ఇన్నిరోజులూ వివిధ రూపాల్లో నిరసన తెలిపిన కార్మిక నేతలు.. మరో అడుగు ముందుకేసి మహా ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ముఖద్వారం నుంచి దొండపర్తిలోని డీఆర్ఎం కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు మహార్యాలీ చేపట్టారు. అనంతరం.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి బహిరంగ సభ నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నిర్ణయంపై ఇక నుంచి ప్రత్యక్షపోరుకు దిగుతామని కార్మిక నేతలు ప్రకటించారు. పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంటు కోసం.. అంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు సంతకాలు సేకరించి పంపడంతోనే సరిపెట్టకుండా.. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఖాళీగా ఉన్న ప్లాంటు భూమిని స్థిరాస్థి వ్యాపారానికి వినియోగిస్తామంటే ఊరుకోబోమని కార్మికులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట‌్ పరిరక్షణ కోసం.. స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సీఎం జగన్‌తో చర్చించాలని డిమాండ్ చేశారు. ఉక్కు కార్మికుల ర్యాలీకి మద్దతుగా.. విజయవాడ, గుంటూరులో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు.