Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ప్రకటించిన విశాఖ బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్‌పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘ నాయకులు తేల్చి చెప్పారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద తోపులాట జరిగింది. స్టీల్‌ప్లాంట్ వద్ద పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసున్నారు. విశాఖ ఆటోమోటివ్ కూడలిలో వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష నేతలు సహా పలు కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దిలపాలెంలో కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి నిరసన చేపట్టింది. సీపీఎం, ఏఐటీయూసీ నాయకుల అరెస్టు చేసి ఎంవీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.