తెలంగాణ

telangana

ETV Bharat / city

Peesapati Likitha : యువ 'మయూరి'.. పీసపాటి లిఖిత - కూచిపూడి డ్యాన్సర్ పీసపాటి లిఖిత

Kuchipudi Dancer Peesapati Likitha : సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి..చిన్నప్పుడే కూచిపూడి నాట్యం నేర్చుకోవాలని కాలికి గజ్జె కట్టింది. తల్లిదండ్రులు వద్దన్నా...ప్రేమతో ఒప్పించి.. నృత్యాన్ని తన జీవితంలో ఓ భాగంగా మార్చుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా...చిన్నప్పటి కాలి గాయం వేధిస్తున్నా.... పట్టుదలతో అధిగమించి... నాట్యానికి నవ్య రీతులు అద్దుతోంది. తనే విశాఖకు చెందిన పీసపాటి లిఖిత. పదునైన మేకులపై నాట్యం చేసి...10 ప్రపంచ స్థాయి రికార్డులు సాధించింది... ఈ యువ కళాకారిణి.

Peesapati Likitha
Peesapati Likitha

By

Published : Mar 31, 2022, 9:55 AM IST

యువ 'మయూరి'.. పీసపాటి లిఖిత

Kuchipudi Dancer Peesapati Likitha : పదునైన మేకులనే పూల రేకులుగా మార్చుకుని నాట్యం చేస్తున్న ఈ యువతి పేరు పీసపాటి లిఖిత. కూచిపూడి అంటే...చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఈ యువతి...ఇప్పుడు అదే కళలో ఒకేసారి 10 ప్రపంచ రికార్డ్‌లు సాధించింది. ఈ రికార్డ్‌ కోసం...ఏకంగా 9 వేల 999 మేకులపై ఏకధాటిగా 9 నిమిషాల పాటు "నవదుర్గ"అంశంపై అమ్మవారిని స్తుతిస్తూ...9 శ్లోకాలకు లిఖిత అద్భుతంగా నాట్యం చేసింది. రికార్డులు సాధించాలనే లక్ష్యంతో పట్టువదలకుండా శ్రమించి...ఈ ఘనత సాధించిందీ... యువతి. నృత్యంలో తనకంటూ విభిన్న శైలిని ఏర్పరుచుకున్న లిఖిత...హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ ప్రదర్శన ఇచ్చింది.

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన లిఖితకు...చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యమంటే ఎంతో ఇష్టం. కానీ.... వేదికలపై అందరికీ కనిపించేలా నాట్యం చేయడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అయినా...తన అభిరుచిని విడిచి పెట్టలేక.. కూచిపూడి నేర్చుకోవాలని పట్టుపట్టింది. ఆమెకు... తండ్రి అండగా నిలిచారు. దాంతో.. సంతోషంగా ముందుకు సాగుతోంది... ఈ యువతి.

నాట్యంపై ఇష్టంతో సాధన చేస్తున్న చిన్నప్పుడే... ఓ ప్రమాదంలో కుడి కాలికి తీవ్ర గాయమైంది. పాదంలో ఎముక విరగడంతో...కొన్నాళ్లు నాట్యానికి దూరంగా ఉంది. అయినా... మనసు కూచిపూడి వైపు పరిగెడుతుంటే...తనెలా కూర్చుకుంటుంది. అందుకే.. కాలికి మళ్లీ గజ్జె కట్టింది. ఎక్కువ సేపు నాట్యం చేసినా, నడిచినా కాలు వాపు వచ్చేది. అయినా ఓర్చుకుంటూ... నాట్యంతో అద్భుత ప్రావీణ్యం సాధించింది.

ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా... కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లి పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేది. అలా వచ్చే డబ్బుతో నాట్యం నేర్చుకుని తల్లిదండ్రులపై భారం పడకుండా చూసుకుంది. విశాఖలో పీజీ పూర్తి చేసిన లిఖిత....ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అల్వాల్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తూనే.. కూచిపూడిలో శిక్షణ పొందుతోంది.

వరల్డ్ రికార్డు ప్రదర్శన కోసం 3 నెలల పాటు శ్రమించింది. మేకులపై నృత్యం అనే సరికి మొదట వెనుకడుగు వేసింది. వైద్యులు కూడా వద్దని వారించారు. కానీ గురువు ప్రోత్సాహంతో ఎట్టకేలకు మేకులపై కాలుపెట్టిన లిఖిత... గాయాలవుతున్నా కఠోర సాధన చేసి...అద్భుత ప్రదర్శిన ఇచ్చింది. నాట్య ప్రియులతో శభాష్ అనిపించుకుంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని తెలియని విషయాల్ని నాట్యం ద్వారా చెప్పాలను కుంటున్న లిఖిత... భావితరాలకు కూచిపూడిని అందించేందుకు ప్రయత్నిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details