కాకతీయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పరీక్షలు రాయడమే కష్టంగా మారింది. పలుమార్లు వాయిదా తర్వాత ఎట్టకేలకు ఈ నెల 22 నుంచి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. తీరాచూస్తే అన్ని కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణకు కేంద్రాలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలు మరోసారి వాయిదా వేస్తూ కేయూ దూరవిద్య కేంద్రం నిర్ణయం తీసుకొంది. గతంలో కేయూ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 140 అధ్యయన కేంద్రాలు(స్టడీ సెంటర్) అన్ని జిల్లాల్లో ఉండేవి. దూరవిద్యలో చదివే విద్యార్థులకు వాటిలో పరీక్షలు రాసే వెసులుబాటు ఉండేది. ఇక్కడ నిర్వహణ పకడ్బందీగా జరగడం లేదంటూ యూజీసీ పరిధిలోని ‘డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో’ (డెబ్) గుర్తించింది.
KU vc letter to deb : 'అన్ని జిల్లాల్లో పరీక్షలకు అవకాశం ఇవ్వండి' - kakatiya university
కాకతీయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోర్సులో చేరిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కేయూ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతి ఉండటం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకు కేయూ వీసీ తాటికొండ రమేశ్ లేఖ రాయనున్నారు.
రెండేళ్ల కిందట కేయూ దూర విద్య పరీక్షలను వర్సిటీ పరిధిలోని పూర్వ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దూర ప్రాంత జిల్లాల విద్యార్థులకు కేయూ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే పరీక్షలు రాయాల్సి రావడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో..‘‘ఈసారి దూర విద్యలో పరీక్షలను ఆయా అధ్యయన కేంద్రాల్లో రాసేందుకు అనుమతివ్వాలి. అవకతవకలకు తావివ్వకుండా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ కళాశాలలను మాత్రమే ఎంచుకుంటాం. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అనుమతివ్వాలి’’అని త్వరలో కేయూ వీసీ తాటికొండ రమేశ్ ‘డెబ్’కు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ లేఖపై వచ్చే సమాధానం తర్వాతే పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తారని సమాచారం.