KTR Letter To Piyush Goyal: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతం పెంచుతూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్ను లేదని.. కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం విధించిందని అన్నారు. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనట్లు లేఖలో మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో 7 శాతం విధించడం సబబు కాదని.. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
కరోనాతో తీవ్ర సంక్షోభం
GST on powerloom and textiles industry: ఇప్పటికే కరోనా ప్రభావంతో టెక్స్‌టైల్, చేనేత రంగాలు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పెంచడమంటే.. ఆ పరిశ్రమను చావుదెబ్బ తీయడమే అని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించేది చేనేత, వస్త్ర పరిశ్రమలని... ఈ పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.